ఏప్రిల్ 3న వైసీపీలో టైమ్ బాంబు పేలబోతోందా?

YSR Congressసిఎం జగన్మోహన్ రెడ్డి హడావుడిగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీతో అర్దరాత్రి వరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమయిన సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికలకు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాల అనుమతి కోరేందుకే ఢిల్లీ వెళ్ళారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఏప్రిల్ 3వ తేదీన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని జగన్‌ నిర్ణయించడంతో వైసీపీ నేతల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది.

బహుశః ముందస్తుకు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాల నుంచి గ్రీన్ సిగ్నల్‌ లభించి ఉండవచ్చు కనుక సమావేశంలో ఆ బాంబు పేలుస్తారేమో?అని కొందరు ఆందోళన చెందుతుంటే, మంత్రివర్గంలో మరో ఇద్దరిని తీసుకోవాలనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి కనుక బహుశః దాని గురించే అయ్యుంటుందని కొందరు భావిస్తున్నారు.

ADVERTISEMENT

కానీ ఇంతకాలం 175 సీట్లు మనవే అనే భ్రమలో ఉంటూ పార్టీలో అందరినీ కూడా అదే భ్రమలో ఉంచి, హటాత్తుగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగలడంతో సిఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం, ఆందోళనతో ఉంటారని అది తమపై ఎక్కడ చూపుతారో… ఆయన ఆగ్రహావేశాలకు తామెక్కడ బలయిపోతామో అని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెడుతున్నా, గడప గడపకి కార్యక్రమంలో ప్రజలను నిత్యం పలకరిస్తున్నా ఎందుకిలా జరిగింది?అని అధినేత తమని నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలో ఎవరికీ తెలీదు.

ఇదివరకు రెండుమూడు సమావేశాలలో పనితీరు బాగోనివారిని నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తానని, అలాంటివారిని తాను భుజాన్న మోయలేనని సిఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. కనుక ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైన్నట్లే ఉంది. ముందస్తుకు వెళ్ళినా వెళ్ళలేకపోయినా, అటువంటి వారందరినీ కరుణిస్తే చివరిసారిగా మరో అవకాశం ఇచ్చి పార్టీలో అందరినీ పరుగులు పెట్టించవచ్చు లేదా నిర్ధాక్షిణ్యంగా పక్కనపెట్టేసి వారి స్థానంలో కొత్తవారికి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించవచ్చు.

కనుక ఏప్రిల్ 3వ తేదీన జరిగే సమావేశం వైసీపీ నేతలందరి గుండెల్లో గుబులు పుట్టిస్తోందని చెప్పవచ్చు. మరి ఆరోజు సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఏం బాంబు పేల్చబోతున్నారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories