ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు రాజకీయ పార్టీలు వీడిన లేదా మారిన నేతలతో కూడా అటువంటి ప్రమాదమే ఉంటుంది.
ముఖ్యంగా తాము వీడిన పార్టీపై వారు చేసే విమర్శలు, ఆరోపణలు, బయటపెట్టే కొత్త విషయాలు సామాన్య ప్రజలకు దిగ్బ్రాంతి కలిగిస్తాయి.
వారి ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నంలో ఆయా పార్టీల నేతలు చేసే ప్రత్యారోపణలు, బయటపెట్టే కొత్త విషయాలు సామాన్య ప్రజలకు ఇంకా దిగ్బ్రాంతి కలిగిస్తాయి.
ఉదాహరణకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన కల్వకుంట్ల కవిత ఆ పార్టీ నేతల అవినీతి భాగోతాలు ఒకటొకటిగా బయటపెడుతుంటే వింటున్న ప్రజలు షాక్ అవుతున్నారు.
అలాగే ఆమె ఆరోపణలపై దీటుగా స్పందిస్తూ మాజీ మంత్రి మాధవరం కృష్ణారావు మరిన్ని కొత్త విషయాలు బయటపెట్టారు.
ఈరోజు అయన మీడియాతో మాట్లాడుతూ, “కవితమ్మా… నీ గురించి పార్టీలో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మంత్రి పదవులు అమ్ముకోలేదా?నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసుకొని ఎంత మందికి మంత్రి పదవులు ఇప్పించావో నాకు తెలుసు.
గల్లీ నుంచి ఢిల్లీ దాక నీ కధలన్నీ నాకు తెలుసు. మీ నాన్న కేసీఆర్ గాంధీలాంటోడు. కానీ నువ్వు అయన పేరు చెడగొట్టావు. ఇప్పటికైనా బుద్ధిగా రాజకీయాలు చేసుకుంటే మంచిది. మేము నోరు విప్పి నీ బండారం బయటపెడితే తెలంగాణలో తలెత్తుకొని తిరగలేవు,” అని అన్నారు.
కేసీఆర్ హయంలో కేవలం అభివృద్ధి, ప్రజా సంక్షేమం తప్ప మరో ప్రసక్తే లేదన్నట్లు మాట్లాడేవారు. నేటికీ అలాగే చెప్పుకుంటున్నారు.
కానీ ప్రభుత్వం మారే సరికి కేసీఆర్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ పార్టీలో అవినీతి పరుల భాగోతాలు ఒకటొకటే బయట పడుతున్నాయి.
ఇంతకాలం కాంగ్రెస్ లేదా బీజేపి అవినీతి జరిగిందని చెపితే అది అబద్దమని తేలికగా కొట్టిపడేస్తున్నారు. కానీ కేస్ కూతురు కల్వకుంట్ల కవిత…. ఆమెని వేలెత్తి చూపుతూ మాజీ మంత్రి మాధవరం కృష్ణారావు అందరూ అవినీతిపరురాలే అని బయట పెట్టుకుంటుంటే ప్రజలు నమ్మకుండా ఉంటారా?
అందరూ కేసీఆర్ గాంధీలాంటోడు అంటూనే అందరూ అవినీతిపరులే అని పరస్పరం ఆరోపించుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీని ఎవరు మాత్రం కాపాడగలరు?






