తెలంగాణలో తాజాగా జరిగిన రెండవ విడత పంచాయితీ ఎన్నికలలో బిఆర్ఎస్ ఆశించినదానికన్నా ఎక్కువగానే ఫలితాలను రాబట్టినట్టు పార్టీ నేతలు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ కు గట్టి పోటీగా నిలబడి బిఆర్ఎస్ పోరాడింది అనే భావనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వ్యక్తపరుస్తున్నారు.
దానితగ్గట్టే బిఆర్ఎస్ పంచాయితీ ఎన్నికలలో రెండవ స్థానంలో ఉంటూ తన ప్రతిపక్ష హోదాను కాపాడుకుంది. ఈ నేపథ్యంలో స్పందించిన కేటీఆర్ ఈ ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయంటూ, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ గెలుపు తధ్యమంటూ బిఆర్ఎస్ శ్రేణులలో జోష్ నింపారు.
ఇదిలా ఉంటే, 2029 ఎన్నికలలో తానూ పోటీ చేస్తానని కవిత తన సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. తన జాగృతిని గ్రామాలకు విస్తరిస్తానని, ప్రతి గ్రామంలో జాగృతి పేరున గ్రామ కమిటీలు వేసి, రాజకీయంగా బలపడతానంటూ చెప్పుకొచ్చారు కవిత.
అయితే ప్రభుత్వ వ్యతిరేకతను కాష్ చేసుకోవడంలో విజయం సాధిస్తూ బిఆర్ఎస్ తిరిగి రాజకీయంగా బలపడితే ఇక భవిష్యత్ లో కవిత రాజకీయం బలిపీఠమెక్కినట్టే అవుతుందేమో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కవిత ఎన్ని రాజకీయాలు నడిపినా, బిఆర్ఎస్ కు ఎంత బలంగా ఎదురెళ్ళినా కవిత రాజకీయానికి నష్టం ఉండకపోవచ్చు.
కానీ ఒక్కసారి తెలంగాణలో తిరిగి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇక కవిత రాజకీయ ప్రయాణానికి ఎండ్ కార్డు పడ్డట్టే అవుతుంది. తమ రాజకీయ ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా, ఆ పార్టీకి ఎంత పూర్వ వైభవం ఉన్నా వాటిని అధఃపాతాళానికి తొక్కడంతో కేసీఆర్ సిద్ధహస్తుడు.
అటువంటి కేసీఆర్ తన పార్టీ పై, తన పార్టీ నాయకుల పై ఇటువంటి అవినీతి ఆరోపణలు చేసిన వారిని ఉపేక్షిస్తారా.? అందుకు కేటీఆర్ అడ్డుపడతారా.? ఏనాటికైనా నేను ముఖ్యమంత్రి అయ్యి తీరుతా అంటూ శపథం చేసిన కవిత ముఖ్యమంత్రి ఆశలను బిఆర్ఎస్ సమాధి చెయ్యకుండా ఉంటుందా.?
బిఆర్ఎస్ బలం పెరిగితే కవిత రాజకీయం క్రమక్రంగా బలహీనపడినట్టే, బిఆర్ఎస్ అధికారం దిశగా అడుగులు వేస్తె కవిత రాజకీయ జీవితం అంధకారమే, బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కవిత ఫలితాన్నే అనుభవించాల్సిందే, బిఆర్ఎస్ కు భవిష్యత్ ఆశలు కనిపిస్తే కవిత భవిష్యత్ బలిపీఠమే..!




