ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్‌.. నీళ్ళ అజెండా.. మర్మమేమిటో?

BRS YSRCP Water Politics

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందామని ఆనాడే కేసీఆర్‌ చెప్పారు. అది కురుక్షేత్ర రణరంగంలో ధర్మరాజు పలికిన ‘అశ్వథామ హతః కుంజరః’ వంటిదని అర్థం చేసుకోవడానికి జనాలకు చాలా కాలం పట్టింది.

అయన తన కుమారుడు కేటీఆర్‌, తన శిష్యుడు జగన్మోహన్ రెడ్డిలని అన్నదమ్ములా కలిసి రాజకీయాలు చేసుకోవాలని చెప్పగా, ఈ జనాలు, మీడియా ఆ మాటని అందరికీ అన్వయించేసుకొని ముచ్చట తీర్చుకున్నారు.

ADVERTISEMENT

అన్నదమ్ముల్లా కలిసి రాజకీయాలు చేసుకోవాలన్నారు కనుక వైసీపీ, బీఆర్ఎస్‌ పార్టీల రాజకీయాలు ఇంచుమించు ఒకేలా సాగుతుంటాయి. చెల్లెమ్మల పంచాయితీలు మొదలు శాసనసభకు డుమ్మా కొట్టడం వరకు అన్నీ సేమ్ టూ సేమ్‌.

ఇందుకు మరో తాజా ఉదాహరణ అక్కడ బీఆర్ఎస్‌ నేతలు, ఇక్కడ వైసీపీ నేతలు ఒకే సమయంలో నీళ్ళ అజెండాతో పోరాటాలకు సిద్ధమవుతుండటమే.

నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, తాడిపత్రిలో వైసీపీ నేతలు ఆందోళనలు మొదలుపెట్టారు. శ్రీశైలం, తుంగభద్ర రిజర్వాయర్‌లో నిండుగా నీళ్ళున్నా కూటమి ప్రభుత్వం నీళ్ళు విడుదల చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తోందని విమర్శలు గుప్పించారు.

సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు సిద్దమవుతోంది.

గోదావరి నుంచి 200 టీఎంసిలు తరలించుకు పోవడానికే సిఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుని ప్రతిపాదించారని ఆరోపిస్తున్నారు.

దీనికి కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి అభ్యంతరాలు లేకుండా చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోందని వాదిస్తోంది.

తెలంగాణ వాటా నీళ్ళని చంద్రబాబు నాయుడు ఎత్తుకుపోయేందుకు ప్రయత్నిస్తుంటే, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని బీఆర్ఎస్‌ వాదిస్తోంది.

సెప్టెంబర్‌ 7న ఢిల్లీలో జరుగబోయే సమావేశం బనకచర్ల ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేందుకే అని వాదిస్తోంది. బనకచర్లని అడ్డుకునేందుకు దేనికైనా సిద్దమని బీఆర్ఎస్‌ పార్టీ స్పష్టం చేసింది.

ఓ పక్క చంద్రబాబు నాయుడు సుమారు లక్ష కోట్లతో బనకచర్ల ప్రాజెక్టుని మూడేళ్ళలో పూర్తిచేసి సీమ జిల్లాలకు తాగు, సాగు నీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్‌ పార్టీ చెపుతోంది. మరో పక్క సీమ జిల్లాలకు నీళ్ళు అందించే ఉద్దేశ్యం చంద్రబాబు నాయుడుకి లేదంటూ వైసీపీ వాదిస్తోంది.

సోదర పార్టీలు ఒకే అజెండాతో ముందుకు సాగుతున్నప్పుడు, ముందుగా ఇలాంటి విషయాలు మాట్లాడుకొని రోడ్లపైకి వస్తే బాగుంటుంది కదా?

ADVERTISEMENT
Latest Stories