ఏపీ బడ్జెట్‌ 2.79 లక్షల కోట్లు…సగం సంక్షేమ పధకాలకే

Buggana_Rajendranath_Reddy_Andhra_Pradesh_Budget_2023ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు ఉదయం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ మొత్తం విలువ రూ.2,79,279 లక్షల కోట్లు! దానిలో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు ద్రవ్యలోటు రూ.54,587 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు రూ.3.77 శాతం, ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం అని బుగ్గన పేర్కొన్నారు.

బడ్జెట్‌లో అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, చేదోడు, వాహనమిత్ర,డీబీటి తదితర సంక్షేమ పధకాలకే దాదాపు సగం అంటే రూ.1,00,036.71 కోట్లు కేటాయించడం విశేషం.

ADVERTISEMENT

ఇటీవల ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర వార్షిక ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు కాగా దానిలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలకే రూ.90,000 కోట్లు ఖర్చవుతోంది. ఉద్యోగుల ఇంక్రిమెంట్స్ వగైరాలకు మరో రూ.8,000 కోట్లు ఖర్చవుతుంది,” అని చెప్పారు.

ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే రాష్ట్ర ఆదాయంలో జీతాలకి పోగా రూ.27,000 కోట్లు మాత్రమే మిగులుతుందని స్పష్టమవుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమ పధకాలకే రూ.1,00,036.71 కోట్లు కేటాయించింది. అంటే మరో 73,036.71 కోట్లు ఉంటే గానీ ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లింపు, సంక్షేమ పధకాలు అమలుచేయడం సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. అంటే ఈ ఏడాది కనీసం అంత అప్పు చేయక తప్పదనుకోవాలి. అంత అప్పు చేసినా జీతాలు, సంక్షేమ పధకాలకు మాత్రమే సరిపోతుంది.

ఇవికాక రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ బిల్లులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల జీతాలు, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు వంటివి ఇంకా చాలానే ఉంటాయి. వాటన్నిటికీ ప్రభుత్వం ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకొంటుందో తెలీదు.

చాలా క్లుప్తంగా లెక్క కట్టుకొంటేనే బడ్జెట్‌లో ఆదాయానికి, కేటాయింపులకి ఎక్కడా పొంతన లేదని స్పష్టమవుతోంది. కానీ బడ్జెట్‌ మాత్రం చాలా ఘనంగా రూ.2.79 లక్షల కోట్లు పైనే ఉంది. ఇది రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి బలమైన నిదర్శనమని రాజేంద్రనాథ్ రెడ్డి చెపుతుంటే అందరూ బుగ్గన వేలేసుకొని వినాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories