నేటికీ దేశంలో అధికార పార్టీలు ప్రతిపక్ష నేతల రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాల పట్ల వివక్ష చూపిస్తూనే ఉంటాయి. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూనే ఉండేవారు. అదేవిధంగా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగకుండా కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించేవారు.
అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇందుకు పూర్తి భిన్నమైన పద్ధతిలో తన రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పరిశ్రమలు, సీ-పోర్టులు, ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఉదాహరణకు కడప జిల్లా అంటే వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కంచుకోట. అదే కడపలో ఇప్పుడు అభివృద్ధి బీజాలు పడుతున్నాయి.
జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె, పెద్ద దండలూరు గ్రామాల మధ్య 1,100 ఎకరాల్లో రూ.4,500 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సంస్థ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో విస్తరణ జరగనుంది. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా, మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
ఒకప్పుడు కడప అంటే ఫ్యాక్షన్‌కు మారుపేరు. కానీ ఇప్పుడు అదే జిల్లాలో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కడపలో రూ.12 కోట్ల వ్యయంతో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘స్టార్టప్ కడప’ పేరుతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
ఇందులో ప్లగ్ అండ్ ప్లే వర్క్‌స్పేస్‌లు, ఇంక్యుబేషన్, మెంటార్‌షిప్, నెట్‌వర్కింగ్, బిజినెస్ మార్గదర్శకత్వం వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కడపలో ఇప్పటికే సుమారు 15 వేల మంది టెక్ ప్రొఫెషనల్స్ ఇంటి నుంచే పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానం చేసి కడపను రాయలసీమలో స్టార్టప్ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
కడపని జగన్ తన రాజకీయ కంచుకోటగా మాత్రమే చూస్తారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు కడప కూడా నా ఆంధ్రప్రదేశ్‌లో భాగమేననే విశాల దృక్పథంతో పరిశ్రమలు, ఉపాధి, స్టార్టప్‌లతో అభివృద్ధికి పునాది వేస్తున్నారు. ఈ అభివృద్ధి ఫలాలు అందడానికి సమయం పట్టొచ్చు. కానీ పునాది వేయకపోతే అభివృద్ధి ఎప్పుడొస్తుంది?





