వైసీపీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేదం అమలుచేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో నాసిరకం మద్యం ఏరులై పారిస్తున్నారని టిడిపి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు నాసిరకం మద్యం, గంజాయి, గన్ కల్చర్ చాప కింద నీరులా అన్ని జిల్లాలకు వ్యాపిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. పరమ పవిత్రమైన తిరుమల కొండపై గంజాయి పట్టుబడగా, పలు జిల్లాలలో తుపాకుల మోతలు వినిపిస్తున్నాయని అన్నారు. నాసిరకం మద్యంతో ప్రజలను దోచుకొంటూ వారి ఆరోగ్యాలను కూడా జగన్ ప్రభుత్వం దెబ్బ తీస్తోందన్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ ప్రవేశపెట్టిన ఘనత సిఎం జగన్మోహన్ రెడ్డిదేనాని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపిస్తున్నారని, ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి కేవలం నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో భ్రష్టు పట్టించేశారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికలకు టిడిపి నేతలను సమాయత్తం చేసేందుకుగాను రాష్ట్రాన్ని నాలుగు జోన్స్‌గా విభజించుకొని, ఒక్కో జోన్ పరిధిలోని జిల్లాల నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న నెల్లూరులో జరిగిన సమావేశంలో జగన్ పాలనలో రాష్ట్రం ఏవిదంగా నష్టపోతోందో వివరించారు. జగన్ పాలనతో ప్రజలు కూడా వేసారిపోయున్నారనే విషయం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలియజేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే వైనాట్ పులివెందుల? అని అంటున్నానన్నారు.
అయితే ఇదివరకు జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలలో దొంగ ఓట్లు ఎలావేసి గెలిచిందని కనుక వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీ అటువంటి ప్రయత్నాలు చేయవచ్చని, వాటిని ధీటుగా ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో టిడిపికి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది కనుక దీనిని పార్టీలో ప్రతీ ఒక్కరూ అందిపుచ్చుకొని, కలిసికట్టుగా పనిచేస్తూ వచ్చే ఎన్నికలలో పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు గట్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీ నాయకులు అందరూ కార్యకర్తలతో సమానంగా ప్రజల మద్య తిరుగుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటేనే ప్రజలు అదరిస్తారని చంద్రబాబు నాయుడు హితవు చెప్పారు. ఇదివరకు టిడిపి ‘బాదుడే బాదుడు’తో ప్రజలను చైతన్య పరచడంతో, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకి కార్యక్రమంతో వచ్చినప్పుడు వారిని సామాన్య ప్రజలు సైతం ఏవిదంగా నిలదీశారో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అందరికీ గుర్తు చేశారు. కనుక ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమానికి ధీటుగా టిడిపి కూడా బలమైన కార్యక్రమంతో ప్రజలలోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు నాయుడు.



