చంద్రబాబు విజన్ వీళ్ళకి అర్ధమవుతుందా?

Chandrababu Naidu’s More Children Advice Triggers Sharmila Row

రాష్ట్ర జనాభాలో యువత సంఖ్య ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండాలని, అప్పుడే స్థిరంగా అభివృద్ధి సాగుతుందని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చెపుతుంటారు.

ప్రస్తుతం చాలా మంది ఒక్క కొడుకు లేదా ఓ కూతురుతోనే సరిపెట్టుకుంటున్నారని దీని వలన భవిష్యత్‌లో యువత సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని చెప్పారు. కనుక కనీసం ముగ్గురు పిల్లలను కనాలని, ఆర్ధిక స్తోమత ఉన్నట్లయితే అంతకు మించి కన్నా మంచిదేనని చెపుతున్నారు. దీని కోసం త్వరలో కొత్త విధానం ప్రకటిస్తామని కూడా చెప్పారు.

ADVERTISEMENT

ఊహించినట్లే వెంటనే చాలా మంది సిఎం చంద్రబాబు నాయుడి ఏకైక కుమారుడు మంత్రి నారా లోకేష్‌, ఆయన ఏకైక కుమారుడు దేవాన్ష్ ప్రస్తావన చేస్తూ “మీరేమో ఒక్కరినే కంటారు. కానీ జనాలకు ఎక్కువ మంది పిల్లలను కనమని ఉచిత సలహాలు ఇస్తుంటారు. మీరు ఆచరించని దానిని ఇతరులకు చెప్పడం దేనికి?

అయినా ప్రభుత్వం ఏడాదికి ఓ పాతికవేలు ఇస్తే దాంతో ఇంత మంది పిల్లల పోషణ సాధ్యమా?” అంటూ వైఎస్ షర్మిలతో సహా చాలా మంది చాలా విమర్శలు చేశారు. అవి సహేతుకమైన విమర్శలే.

ఈరోజుల్లో ఇద్దరు ముగ్గురు పిల్లలను పోషించడం చాలా కష్టమే. పైగా ఎవరికీ ఉద్యోగ భద్రత కూడా ఉండటం లేదు. కనుక సామాన్య మధ్యతరతి ప్రజలు మొదలు లక్షల వార్షిక ప్యాకేజిలు అందుకుంటున్న ఐటి ఉద్యోగులు సైతం ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు.

ఈ సమస్యలకు ప్రభుత్వాల వద్ద కూడా సమాధానాలు, పరిష్కారాలు లేవు. కనుక పిల్లలను కనమని ఒత్తిడి చేయలేవు. కేవలం సూచన చేయగలవు. కనుక ఈ సూచన చేసినందుకు చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడాల్సిన అవసరం లేదు.

ఇక్కడ ఆలోచించాల్సింది ఆయన చెప్పిన సమస్య తీవ్రత గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కాదు. ఒకప్పుడు చైనా జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో ఒక్క సంతానం విధానాన్ని దశాబ్దాల పాటు చాలా ఖచ్చితంగా అమలుచేసింది. తత్ఫలితంగా ఇప్పుడు ఆ దేశంలో యువ జనాభా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కనుక ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలను కనమని ఒత్తిడి చేస్తోంది.

చైనా పరిస్థితిని కళ్ళారా చూస్తున్నప్పుడు ముందే జాగ్రత్త పడటం మంచిదని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. ఆయన అంత దూరం ఆలోచించగలరు కనుకనే ఈ సలహా చెపుతున్నారు.

మనమే మరో 30 ఏళ్ళు అధికారంలో ఉండాలి… ఉంటామని నమ్మకంగా చెప్పే రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ ముప్పై ఏళ్ళ తర్వాత దేశం, రాష్ట్రం పరిస్థితి ఏవిదంగా ఉంటుందని ఎవరూ ఆలోచించరు. ఎందుకంటే వారికి అంత దూరదృష్టి, అవసరం, ఆసక్తి లేవు కనుక!

మన పూర్వీకులు మొక్కలు నాటుతున్నప్పుడు తమ జీవిత కాలంలో వాటి ఫలాలు లభించవని మానుకుంటే దేశంలో నేడు ఇన్ని చెట్లు ఉండేవా?కేవలం దేశం, రాష్ట్రం, సమాజం, భవిష్యత్‌ తరాల గురించి ఆలోచించేవారు మాత్రమే ఇలాంటి ఆలోచనలు చేయగలరు. చెప్పగలరు.

కానీ ముందే చెప్పుకున్నట్లు మనం మన పూర్వీకులంత గొప్పవాళ్ళం కాము. ఇంట్లో తల్లి తండ్రులు, అత్తమామాలనే భారం అనుకుంటున్న ఈ రోజుల్లో దేశం, రాష్ట్రం, సమాజం గురించి ఆలోచించి ఎక్కువ మంది పిల్లలని కని, ఆ భారం మోయమంటే ఎవరూ మోయారు.

కనుక సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన దానిలో మంచిని స్వీకరించి, నచ్చితే ఆచరించవచ్చు లేకుంటే దణ్ణం పెట్టి ఊరుకోవచ్చు. అప్పటి సమస్యలను అప్పటి పాలకులే పరిష్కరించుకుంటారు.

ADVERTISEMENT
Latest Stories