కందుకూరు, గుంటూరు సభలలో తొక్కిసలాటలను సాకుగా చూపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ పార్టీలను సభలు, సమావేశాలు నిర్వహించుకోకుండా నిషేదం విధించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు గొంతులు ప్రజలకి వినబడకుండా చేయడానికే జగన్ ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందని రామకృష్ణ ఆరోపించారు. రోడ్లపై ప్రయాణిస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఇళ్ళలో కూర్చోరు కదా?సభలు, సమావేశాలతో ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని, వాటిలో తొక్కిసలాటలు జరుగుతాయని ప్రభుత్వం జీవో ఇవ్వడం అంటే రాజకీయ పార్టీల హక్కులను కాలరాయడమే అని అన్నారు.
జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంతగా ఖూనీ అవుతోందో తెలుసుకోవడానికి ఈ జీవోయే తాజా ఉదాహరణ అని రామకృష్ణ అన్నారు. ప్రత్యేక పరిస్థితులలో సభలు, సమావేశాలకు అనుమతిస్తామని జీవోలో పేర్కొన్నారు. ఆ ప్రత్యేక పరిస్థితులు ఒక్క వైసీపీకి మాత్రమే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు హయాంలో పుష్కరాల సమయంలో తొక్కిసలాటలు జరిగి అనేక మంది చనిపోయారని, కానీ పుష్కరాలు రద్దు చేయలేదు కదా? కనుక ప్రభుత్వం తక్షణం జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌పై చేస్తున్నాము. లేకుంటే న్యాయపోరాటం చేస్తాము,” అని రామకృష్ణ హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో ఈ జీవో జారీ చేసినప్పటికీ, ఇది దానికి కూడా తప్పక వర్తిస్తుంది. కనుక ఆ పార్టీ సభలు, సమావేశాలకి కూడా పోలీసుల అనుమతి అవసరం. అయితే అధికార పార్టీ కనుక వైసీపీ సభలు, ర్యాలీలకి పోలీసులు అనుమతిస్తే ప్రతిపక్షాలు న్యాయస్థానానికి ఫిర్యాదు చేయకుండా ఉండవు. అప్పుడు ఇబ్బందిపడేది వైసీపీయే. అయినా ఈ జీవోతో ప్రతిపక్షాల రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది కనుక నేడో రేపో హైకోర్టుని ఆశ్రయించడం ఖాయమే. కనుక హైకోర్టు చేత చెప్పించుకొనే బదులు ఈ జీవో విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయడం మంచిదేమో?



