ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులలో ఒకరని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈరోజు ఈడీ నుంచి తొలి పిలుపు వచ్చింది. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో ఆయన కుమారుడు రాఘవ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి, రామచంద్ర అరుణ్ పిళ్ళై, ఆడిటర్ బుచ్చిబాబుతో సహా పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.
తెలంగాణ సిఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను సీబీఐ ఓసారి, ఈడీ ఓసారి ప్రశ్నించాయి. ఈరోజు ఢిల్లీలో మరోసారి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉండగా ఆమె ఆరోగ్య కారణాలతో విచారణకు హాజరుకాకుండా తప్పించుకొన్నారు. కనుక ఆమెను ఈ నెల 20వ తేదీన హాజరుకావాలని ఆదేశిస్తూ ఈడీ ఇవాళ్ళ మరోసారి నోటీస్ జారీ చేసింది.
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సహా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరూ అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమకు ఎటువంటి సంబందమూ లేదని, కేంద్ర ప్రభుత్వం రాజకీయకక్షతోనే తమపై అక్రమకేసులు బనాయించిందని వాదిస్తున్నారు. ఇదే సమయంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో సహా అందరూ తమకు ఈ హత్యతో ఎటువంటి సంబందమూ లేదని, టిడిపి రాజకీయ ఒత్తిడి కారణంగా సీబీఐ తమపై అక్రమకేసు బనాయించి వేధిస్తోందని ఆరోపిస్తున్నారు.
అందరూ నిర్ధోషులైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎవరు చేశారు? ఢిల్లీ ప్రభుత్వం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కారణంగా మళ్ళీ పాత మద్యం విధానాన్నే మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఇటీవల జీవో ఎందుకు జారీ చేసిన్నట్లు?వివేకాను అంత దారుణంగా ఎవరు హత్య చేశారు?
ఈ రెండు వేర్వేరు కేసులపై విచారణ జరుపుతున్న ఈడీ, సీబీఐలు అనేక పక్కా సాక్ష్యాధారాలతోనే నిందితులందరికీ నోటీసులు పంపి ప్రశ్నిస్తున్నాయి. కానీ నిందితులందరూ తెలివిగా చట్టంలో లొసుగులను ఉపయోగించుకొంటూ తప్పించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా రాజకీయ సమీకరణాలు మారితే, నిందితులందరికీ కేంద్ర ప్రభుత్వమే రక్షణ కవచాలు తొడిగేసి, అందరినీ కాపాడుకొంటుంది. బహుశః చివరికి ఇదే జరుగవచ్చు. అప్పుడు ఈ కేసులు, నోటీసులు, విచారణలు, అరెస్టులు… వాటి కోసం ఈడీ, సీబీఐ పడిన శ్రమ, మళ్ళీ వాటి కోసం చేసిన వందల కోట్ల ఖర్చు అంతా ఏట్లో పిసికిన చింతపండే అవుతుంది.



