అసలు ఫ్యాక్షన్ ఎక్కడ పుట్టింది ఏ ప్రాంతంలో మొదలయ్యిందంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం. ఒక్కడు, ప్రేమించుకుందాం రా లాంటి సినిమాలు చూసి కర్నూలులోనే ఎక్కువగా ఉంటుందనో లేదా అనంతపూర్ లో కత్తులు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతారనుకుంటే అంతకన్నా పెద్ద జోక్ ఉండదు. ఆ మాటకొస్తే బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం లాంటి క్లాసిక్స్ చూసినప్పుడు ఒకప్పటి కాలంలోనే ఎంత భీకరమైన ఫ్యాక్షన్ ఉందో అర్థమవుతుంది. సరే అంత వెనక్కు వెళ్లలేం కానీ తెరమీద సీమ రక్తపాతం ఎప్పుడు ఎవరు షురూ చేశారనే దాని మీద కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి.
1999లో సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ కావడం అందులో బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్ నటించడం వల్ల ఫ్యాక్షన్ జానర్ ని అప్పుడు తీసుకొచ్చారని చాలా మంది అనుకుంటారు కానీ వాస్తవం అది కాదు. ఈ సినిమాకు రచన చేసిన పరుచూరి బ్రదర్స్ అంతకు ఎనిమిదేళ్ల ముందే దాన్ని పరిచయం చేశారు. 1991లో నటి ఊర్వశి శారద, దివంగత నటులు చలపతిరావు నిర్మాణ భాగస్వామ్యులుగా కడప రెడ్డెమ్మ నిర్మించారు. దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ. అవును ఈ మధ్యే ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ ఫ్లైట్ టికెట్లకు అయిన ఖర్చుతో ఎనిమిది సినిమాలు తీసి పెడతామని చెప్పినాయనే దీనికి డైరెక్టర్.
కథ కడప ప్రాంతంలో జరిగినట్టు చూపించారు. రెండు ముఠాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో కక్షలతో రగిలిపోతూ ఉంటాయి. చెరో వైపు నుంచి ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. వాళ్ళ వెంటపడిన పెద్దలను తప్పించుకుని ఆ జంట పారిపోయి వేరే చోట కాపురముండి ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఊరికి తిరిగి వస్తారు. అయినా కనికరం లేని ఆ కుటుంబాలు వీళ్ళను చంపే దాకా వదిలిపెట్టవు. హింస భారీగా ఉంటుంది. అప్పటికే హీరోగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న మోహన్ బాబు కథ నచ్చి ఇందులో విలన్ గా నటించారు గిరిబాబు, అన్నపూర్ణ, నూతన్ ప్రసాద్ ఇలా అప్పటి సీనియర్ మోస్ట్ తరగణమంతా ఇందులో ఉన్నారు.
ఒకరకంగా చెప్పాలంటే సీమ ఫ్యాక్షన్ కు టాలీవుడ్ లో పునాది వేసింది ఈ సినిమానే. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆనంద్, నిత్యానంద వివాదంలో హైలైట్ అయిన రంజిత హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. విద్యాసాగర్ సంగీతమందించారు. ఇందులో ఆర్టిస్టు ప్రసాద్ బాబు పేరు ఇంద్రసేనారెడ్డి. క్యాస్టింగ్ పెద్దగానే పెట్టుకున్నారు. ఇంత వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో నాలుగు డ్యూయెట్లు, ఒక కాలేజీ సాంగ్ పెట్టడం ఫ్లోని దెబ్బ తీసింది. శారద, మోహన్ బాబుల నటన ప్రధాన ఆకర్షణ. కమర్షియల్ గా ఓకే అనిపించుకుందే తప్ప కడప రెడ్డెమ్మ మరీ అద్భుతాలేమీ చేయలేదు. అందుకే కొంత గ్యాప్ తర్వాత పరుచూరి సోదరులే మళ్ళీ దీనికి ఊపిరి పోశారు.



