పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చూసిన తర్వాత ఇప్పుడు దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలకు ‘సర్’ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) బెంగ పట్టుకుంది.
‘సర్’ పేరుతో తమ పార్టీ ఓట్లన్నీ రద్దు చేసి దొడ్డిదారిలో బిజేపి అధికారంలోకి వచ్చిందని పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం మమతా బెనర్జీ పదేపదే ఆరోపిస్తున్నారు. ఆమె ఆరోపణలని బిజేపి కొట్టిపడేసినా, బిజేపియేతర పార్టీలు, ముఖ్యంగా బిజేపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ, జాతీయ పార్టీలు మాత్రం ‘సర్ దెబ్బ’ చూసి ఆందోళన చెందుతూనే ఉన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే రెండు దశలలో ‘సర్’ లెక్కలు తీశారు. జూన్‌లో మళ్ళీ మూడోసారి ఓటర్ల జాబితాలు పరిశీలన చేయబోతున్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఏపీలో, జూన్‌లో 25 నుంచి జూలై 24 వరకు తెలంగాణలో ఓటర్ల జాబితాలలో ఉన్నవారి ఇళ్ళకు సిబ్బంది వెళ్ళి నిజంగా ఆ పేరుతో ఓటర్లు అక్కడ ఉన్నారా లేరా? ఒకవేళ ఉంటే వారి పేర్లు వేరే రాష్ట్రం, వేరే నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయా? వంటి పలు కీలకమైన వివరాలు సేకరించి అనర్హులైన ఓటర్లను జాబితాలలో నుంచి తొలగిస్తారు.
కనుక ‘సర్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తమ ఓటు బ్యాంకుని ఎక్కడ దెబ్బ తీస్తుందోనని ఏపీలోని వైసీపీ, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాలు, ఇతర పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికల ఫలితాలను ‘సర్’ తారుమారు చేయగలదని పశ్చిమ బెంగాల్లో రుజువైంది కనుక అవి మరింత ఆందోళన చెందడం సహజమే.
కనుక ఆయా పార్టీల ‘సర్’ సర్వే జరుగుతున్నప్పుడు విధిగా దగ్గరుండి తమ ఓటు బ్యాంకుకి నష్టం కలుగకుండా చూసే బాధ్యతని తమ నేతలు, కార్యకర్తలకు అప్పగించాయి. కానీ ‘సర్’ దెబ్బ నుంచి తప్పించుకోగలవా? లేకుంటే వాటి పరిస్థితి ఏమిటి?




