ఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు కొద్ది సేపటి క్రితం ఏపీ శాసనసభలో కమిటీ హాల్ నంబర్:1లో పోలింగ్ ప్రారంభం అయ్యింది. ముందుగా సిఎం జగన్మోహన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు తమ ఓటు హక్కుని వినియోగించుకొన్నారు.
ఈ ఎన్నికలలో వైసీపీ ఏడు స్థానాలకు పోటీ చేస్తుండగా, టిడిపి ఒకే ఒక స్థానానికి పంచుమర్తి అనురాధను అభ్యర్ధిగా బరిలో దింపింది. పోలింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.
ఇదివరకు శాసనసభలో సిఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే వైసీపీ సభ్యులు చంద్రబాబు నాయుడుని దారుణంగా అవమానించడంతో మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే శాసనసభలో అడుగుపెడతానని శపధం చేశారు. ఈ ఎన్నికలు టిడిపికి చాలా కీలకం కనుక ఈరోజు ఆయన కూడా వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు కానీ శాసనసభ సమావేశాలకు మాత్రం వెళ్ళరు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా గత ఏడాది టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ ఫార్మాట్‌లోనే ఆయన తన రాజీనామా పత్రాన్ని పంపించారు. గత మూడేళ్ళుగా టిడిపికి దూరంగా ఉన్నందున తన రాజీనామాని ఆమోదించాలని కోరుతూ ఆయన స్పీకర్‌కి లేఖలు కూడా వ్రాశారు. కానీ నేటి వరకు దానికి స్పీకర్ ఆమోదం తెలుపలేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ టిడిపికి దగ్గరయ్యారు కనుక నేడు ఓటు వేసేందుకు వస్తారా? స్పీకర్ ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదు కనుక రిటర్నింగ్ అధికారి ఆయనను ఓటు వేసేందుకు అనుమతిస్తారా? ఒకవేళ అనుమతిస్తే స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించిన్నట్లు ప్రకటిస్తారా?అనే ప్రశ్నలకు ఈరోజు సాయంత్రంలోగా తప్పక సమాధానాలు లభిస్తాయి.



