తెలంగాణలో గత కొన్నేళ్ళుగా బిఆర్ఎస్, బిజెపిల మద్య రాజకీయ ఆధిపత్యపోరు సాగుతోంది. ఆ పోరు కారణంగానే కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో యుద్దం ప్రారంభించారు. ఆ కారణంగానే టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చి మోడీని గద్దె దించుతానని బయలుదేరుతున్నారు. అయితే ఢిల్లీ పీఠం అధిష్టించేందుకు ఆయన ముందుగా ఏపీ నుంచే పని మొదలుపెట్టారు.
ఇంతవరకు దీనిపై ఏపీలో వైసీపీ ఒక్కటే స్పందిస్తోంది. టిడిపి, జనసేనలు స్పందించడం లేదు. కానీ కేసీఆర్ తమపై కత్తులు దూసి యుద్ధానికి వస్తున్నారు కనుక తొలిసారిగా బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. అదీ… చాలా చాలా ఘాటుగా!
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ సిఎం కేసీఆర్ ఆనాడు ఏపీ ప్రజలను హైదరాబాద్ నుంచి తరిమి తరిమి కొడతానని అన్నందుకు ముందుగా ఆంధ్రా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో ప్రజలే కేసీఆర్‌ని ఛీకొడుతూ మాకొద్దని చెపుతుంటే ఆయన ఏపీ ప్రజలకి ఎందుకు? బిఆర్ఎస్ పార్టీ ఏపీకి అవసరం లేదు. అసలు కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని ఏపీకి వస్తున్నారు? బిఆర్ఎస్ పార్టీని ఏపీ ప్రజలు ఎందుకు సమర్ధించాలి?
కరోనా సమయంలో ఏపీ నుంచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు అంబులెన్సులలో హైదరాబాద్ వస్తుంటే వారిని తెలంగాణలో ప్రవేశించకుండా అడ్డుకొన్నారు కదా?పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేసింది మీరే కాదా? ఆంధ్రాలో వ్యవసాయానికి ఉపయోగపడవలసిన నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని వృధాగా సముద్రంలో వదిలేసింది ఎవరు? మీరే కదా? ఏపీలో సాగునీటి ప్రాజెక్టులను కట్టుకోనీయకుండా అడుగడుగునా అడ్డుపడుతున్న కేసీఆర్ ఏపీలో బిఆర్ఎస్‌ని గెలిపిస్తే సస్యశ్యామలం చేస్తామని చెప్పడం, రైతు బంధు ఇస్తామని మాయామాటలు చెపుతున్నారు.
ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించకుండా, నీళ్ళు, ఆస్తులు పంచకుండా అడ్డుపడుతూ మళ్ళీ ఏపీలో పోటీ చేస్తాము… మాకే ఓట్లేయమని ఏవిదంగా అడుగుతారు?ఏపీకి బిఆర్ఎస్ పార్టీ రానవసరం లేదు. వస్తే ఆంధ్రా ప్రజలు తప్పకుండా తగినవిదంగా బుద్ధి చెపుతారు,” అని జీవీఎల్ నరసింహారావు అన్నారు.
ఏపీలో అడుగుపెట్టాలనుకొంటున్న కేసీఆర్ ఇటువంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన ఆంద్రా ప్రజలు, దానికి కారకుడైన కేసీఆర్ వస్తే ఎర్ర తివాచీ స్వాగతం పలుకుతారనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.



