తెలంగాణలో ఎదురేలేదనుకున్న కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీలను వరుసగా రెండు ఎన్నికలలో ఓడించిన ఘనుడు రేవంత్ రెడ్డి. పార్టీలో సీనియర్స్ అందరికీ పూర్తి స్వేచ్చ ఇచ్చినా ఎవరూ కూడా ఇదివరకులా రేవంత్ రెడ్డిని విమర్శించలేకపోతున్నారు. అంటే ఇటు ప్రభుత్వంపై, అటు పార్టీపై కూడా రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించిన్నట్లే భావించవచ్చు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం కొన్ని సంక్షేమ పధకాలు అమలుచేసి ప్రజల మెప్పు కూడా పొందారు. ఇవన్నీ కేవలం 7-8 నెలలోనే సాధించగలిగారు. కానీ హైడ్రాని రంగంలో దించడంతో కేవలం మూడు నెలల్లోనే భవనాలతో పాటు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టని కూల్చేస్తోంది.
హైడ్రా మొదట నాగార్జున న్ కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు అందరూ ‘ఆహా ఓహో’ అన్నారు. ఆ తర్వాత అది బిఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, కేటీఆర్ తదితరుల ఇళ్ళపై పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా అది దిశ మార్చుకొని నిరుపేద, మద్యతరగతి, ఎగువ మద్య తరగతి ప్రజల ఇళ్ళని కూల్చివేయడం మొదలుపెట్టింది.
హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్‌లో వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారందరూ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతున్నారు.
తమ జీవితకాలం కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ఒక్క నిమిషంలో కూల్చివేసి రోడ్డున పడేశారని నిర్వాసితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇళ్ళు కూలిపోయి ఏడుస్తుంటే, బ్యాంకువాళ్ళు ఈఎంఐలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుంటే కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల గోడు అన్ని పత్రికలు, అన్ని న్యూస్ ఛానల్స్‌లో వస్తూనే ఉన్నాయి. కనుక సిఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియదని అనుకోలేము. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరూ స్పందించడం లేదు. చివరికి ఇటువంటి సందర్భాలలో చాలా ధైర్యంగా మాట్లాడే సీనియర్ నేత వీ.హనుమంత రావు సైతం నోరు విప్పడం లేదు. కాంగ్రెస్ నేతలందరినీ రేవంత్ రెడ్డి ఇంతగా ఎలా కట్టడి చేయగలిగారని ఆశ్చర్యం కలుగుతుంది.
కాంగ్రెస్ నేతలు స్పందించక పోవడంతో హైడ్రా బాధితులు అందరూ ఇప్పుడు బిఆర్ఎస్ కార్యాలయానికి క్యూకట్టి హరీష్ రావుకి మొరపెట్టుకొంటున్నారు. వారికి ఆయన ధైర్యం చెప్పి రేపటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ హైడ్రాని అడ్డుకుంటామని ధైర్యం చెపుతున్నారు.
రేవంత్ రెడ్డి ఈ స్థాయికి రావడానికి ఎన్నో సమస్యలు, సవాళ్ళు, అవరోధాలు, అవమానాలు భరించారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ ఉండగా మరో పార్టీ ఎన్నటికీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదనే భావన సర్వత్రా నెలకొని ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఆ అవరోధాలటినీ అధిగమించి, కేసీఆర్‌ని మట్టి కరిపించి ముఖ్యమంత్రి పదవి చేప్పట్టారు.
కానీ హైడ్రాతో ఇప్పుడు ఆయనే స్వయంగా హైదరాబాద్ ఓటర్లను, ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఓటర్లను బిఆర్ఎస్ పార్టీ వద్దకు పంపిస్తున్నట్లున్నారు.
ఇంతకాలం సరైన అవకాశం దొరక్క ఢీలాపడిన బిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రజలే తమని వెతుకొంటూ వస్తుంటే వద్దనుకుంటుందా… ఊరుకుంటుందా?
హైడ్రాతో ప్రజలలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని తెలుస్తున్నా రేవంత్ రెడ్డి దానికి చట్టబద్దత కల్పించి, అధికారులు సిబ్బందిని కేటాయించి దాని పరిధిని ఇంకా పెంచారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఎవరూ మాట్లాడనప్పటికీ హైడ్రాని వ్యతిరేకిస్తున్నవారు తప్పకుండా ఉంటారు. వారు ఏకమై కేసీఆర్‌తో చేతులు కలిపితే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రజల ఆక్రోశం, వారి ఆక్రందనలు వినిపించుకోకపోతే ఆయన ప్రభుత్వానికే ప్రమాదం.




