ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పనితీరు, సమర్దత ఎలా ఉన్నప్పటికీ వారికి అంత క్లిష్టమైన చదువులు చదివినందుకు సమాజంలో చాలా గౌరవం లభిస్తుంటుంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హోదాతో మరికొంత గుర్తింపు లభిస్తుంది.
ఆ చదువు, హోదాలకు తగిన ప్రతిభ, పనితీరు, శక్తిసామర్ధ్యాలు కూడా ఉంటే అంచెలంచెలుగా ప్రభుత్వంలో మరింత ఉన్నతస్థాయికి ఎదుగుతారు.
వీటన్నిటికీ తోడు పుష్పానికి పరిమళంలా హుందాతనం, నైతిక విలువలు కూడా ఉంటే ప్రజలలో చాలా గౌరవం పొందుతారు.
కనుక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సమాజంలో ఏదో ఓ స్థాయిలో గౌరవం పొందుతూనే ఉంటారు. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరించి సస్పెండ్ అయినవారు, జైలు పాలైనవారు కూడా ఉంటారు.
వైసీపీ హయంలో చెలరేగిపోయిన ఐపీఎస్ అధికారులలో సునీల్ నాయక్ కూడా ఒకరు. ఆయన పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం లాలీపురం తండాకు చెందినవారు. ఎస్టీ వర్గానికి చెందిన సునీల్ నాయక్ చాలా కష్టపడి చదివి బీహార్ క్యాడర్ నుంచి ఐపీఎస్ అయ్యారు.
జగన్ హయంలో అంతర్ రాష్ట్ర పదోన్నతిపై ఏపీ సీఐడీ డీఐజీగా చేశారు. డెప్యుటేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ బిహార్ తిరిగి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర అగ్నిమాపక, హోంగార్డుల విభాగానికి ఐజీగా చేస్తున్నారు.
పల్నాడులో ఓ మారుమూల గిరిజన తండాకు చెందిన సునీల్ నాయక్ ఈ స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయం. ఆయన కేవలం తన ప్రతిభ, పట్టుదలతోనే ఈ స్థాయికి ఎదిగారని అర్ధమవుతూనే ఉంది. కనుక వాటి ద్వారానే అయన తన గుర్తింపుని చాటుకోవాలి.
కానీ వైసీపీ హయంలో ఆయన రఘురామ కృష్ణరాజుని విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఏపీ పోలీసులు బిహార్ వెళ్లి సోమవారం ఆయనని అరెస్ట్ చేశారు.
ఇంత ఉన్నత చదువులు చదివి ఈ స్థాయికి ఎదిగిన సునీల్ నాయక్, చివరికి కులం కార్డు బయటకు తీయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆయన తాజా ట్వీట్‌లో “నేను ఎస్టీగా పుట్టడమే నా నేరమా? చిన్న కులాలకు చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తుండటం కొంతమంది సహించలేకపోతున్నట్లున్నారు. 2024లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు. కానీ 2021లో జరిగిన ఆ ఘటనతో నాకు ఎటువంటి సంబంధమూ లేనప్పటికీ దానిలో నన్ను బలవంతంగా ఇరికించారు. నా పేరుని వాంటడ్ లిస్టులో చేర్చారు. కనుక నేను నిందితుడునా?” అని సునీల్ నాయక్ ట్వీట్ చేసారు.
ఏపీ పోలీసులు ఆయనని అరెస్ట్ చేసేందుకు వస్తున్న సమాచారం ముందుగానే అందుకున్న సునీల్ నాయక్, అక్కడ తన అధీనంలో పనిచేసే హోంగార్డులను, పోలీస్ సిబ్బందిని రక్షణ కవచంగా వాడుకున్నారు.
ఆయనని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిస్ట్ వారెంట్‌తో ఏపీకి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా ఇదేవిధంగా గందరగోళం సృష్టించి, కోర్టుని తప్పుదోవ పట్టించి అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారు.
ఇది బీహార్ లేదా వైసీపీ స్టైల్ అని సరిపెట్టుకున్నా, ఇంత చదువు చదివి, ఇంత హోదాలో ఉన్నప్పుడు అచ్చం రాజకీయ నాయకుల్లాగే సునీల్ నాయక్ కూడా కులం కార్డు వాడటం అంటే, ఆయన తనను తాను అవమానించుకున్నట్లే కదా?




