చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎన్నికలలో మళ్ళీ అగ్నిపరీక్ష తప్పదా?

Chandrababu Naiduగత ఎన్నికలకుముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు, జనసేన వేరేగా పోటీ చేసి ఓట్లు చీల్చడంతో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి ఎంతగానో పోరాడుతూ మళ్ళీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకొంటోంది. పవన్‌ కళ్యాణ్‌ బిజెపితో సఖ్యతగా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు టిడిపితో పొత్తులు లేదా అవగాహనకి సిద్దం అవుతున్న సూచనలు ఇస్తున్నారు.

కనుక రాష్ట్రంలో టిడిపి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతున్న ఈ తరుణంలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బిఆర్ఎస్‌ పార్టీ ఏపీలో 175 స్థానాలకి పోటీ చేసేందుకు సిద్దం అవుతోందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఈరోజే తిరుపతిలో ప్రకటించారు. ఏపీలో బిఆర్ఎస్‌ని గెలిపిస్తే తెలంగాణలో అమలుచేస్తున్న అన్ని పధకాలు ఏపీలో కూడా అమలుచేస్తామని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసినట్లే ఏపీలో పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తిచేస్తామని చెప్పారు. ఏపీకి చెందిన కొందరు రాజకీయ నిరుద్యోగులు బిఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు కేసీఆర్‌ గుమ్మం ముందు ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT

కనుక వచ్చే ఎన్నికలలో టిడిపికి వైసీపీతో పాటు బిఆర్ఎస్‌ నుంచి కూడా గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు. అంటే గత ఎన్నికలలో జనసేన వలన నష్టపోతే ఈసారి బిఆర్ఎస్‌ వలన నష్టపోయే ప్రమాదం పొంచిఉందని భావించవచ్చు.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల మంత్రులు లేదా రెండు రాష్ట్రాలలో అధికార పార్టీ నేతల మద్య మంచి అవగాహనే ఉందనేది అందరికీ తెలిసిన రహస్యమే. అయితే కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించుతానని చెపుతున్నారు కనుక ఏపీలో వైసీపీ నేరుగా బిఆర్ఎస్‌తో పొత్తులు పెట్టుకొనే సాహసం చేయలేదు. కనుక వచ్చే ఎన్నికలలో ఆ రెండు పార్టీలు పైకి కత్తులు దూసుకొంటూనే పరస్పరం సహకరించుకోవచ్చు. ఎందుకంటే ఆ రెండు పార్టీల ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడే కనుక!

అయితే ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీస్తూ, ఏపీ ప్రజలని అవమానిస్తున్న కేసీఆర్‌కి, బిఆర్ఎస్‌ పార్టీకి ఏపీలో ప్రజలు ఆదరిస్తారా?అంటే దానికి కేసీఆర్‌ అప్పుడే ఓ విరుగుడు మంత్రం కనిపెట్టారు. ఏపీలో ప్రజల కులబలహీనతనే కేసీఆర్‌ అస్త్రాలుగా మార్చుకొని ప్రజలపై ప్రయోగించడానికి సిద్దం అవుతున్నారు.

మరో విషయం ఏమిటంటే ఇరువురు ముఖ్యమంత్రులు, వారి పార్టీలు కూడా చాలా సంపన్నమైనవే కనుక వచ్చే ఏపీ శాసనసభ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలువబోతున్నాయి. కనుక చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, ఆ రెండు పార్టీలకి వాటి నేతలకి కూడా వచ్చే ఎన్నికలు అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories