సూపర్ స్టార్ కృష్ణ , విజయనిర్మల నటించిన దేవదాస్ సినిమాలోని ఈ పాట “కల చెదిరిందా ..కథ మారిందా”? ఇప్పుడు జగన్, కేసీఆర్ లకు కరెక్టుగా సరిపోతుంది. ఆ సినిమాలో కృష్ణ విజయనిర్మల జీవితాలలో జరిగిన ఊహించని ఒక్క సంఘటన వారి జీవితాలను ఎలా తలక్రిందుల చేసిందో తెలిపే పాటే ఇది.
Also Read – కేసీఆర్ ఊసుపోక యాగాలు చేయలేదు స్మీ!
సరిగ్గా అలాగే ఒక్క ఓటమితో జగన్ కన్న కలలు, కేసీఆర్ రాసుకున్న కథలు ఎలా ఆవిరయ్యాయో ఇప్పుడు చూద్దాం. గెలుపుతో వచ్చిన అధికారంతో నాయకుడు రాష్ట్ర బరువు బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. ప్రజల పట్ల జవాబుదారిగా ఉంటూ పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
అయితే బరువు మోసేటప్పుడు తల దించకూడదు, బాధ్యతతో ఉన్నప్పుడు తల ఎగరెయ్యకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని మరిచిన వీరిద్దరూ ఇప్పుడు పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, నేతలను నిలబెట్టుకోవడానికి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ అధికార పక్షంతో పోరాడుతున్నారు.
Also Read – చెప్పాల్సింది చెప్పేసి తూచ్ అంటే ఎలా బ్రహ్మాజీ?
ఒక్క ఓటమి వై నాట్ 175 అన్న జగన్ ‘కల’ను చెరిపేసింది. ఒక్క ఓటమి దేశ రాజకీయాలను శాసించాలి అన్న కేసీఆర్ ‘కథ’ను మార్చేసింది. 2024 ఎన్నికలలో మరోసారి గెలిచి రాష్ట్రంలో ప్రతిపక్షమన్న పేరే లేకుండా చేసి టీడీపీ, జనసేన పార్టీలను భూస్థాపితం చేసేయాలి అన్న జగన్ కలను ఏపీ ప్రజానీకం బటన్ నొక్కి చెరిపేసారు.
2023 ఎన్నికలలో హ్యాట్రిక్ విజయం సాధించి రాష్ట్ర నాయకత్వాన్ని వారసుడికి అప్పగించి, జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు సాధించి, దేశ రాజకీయాలలో బిఆర్ఎస్ పార్టీని సుస్థిరం చెయ్యాలి అని రాసుకున్న కేసీఆర్ కథను మార్చారు తెలంగాణ వాసులు.
Also Read – జయభేరీకి హైడ్రా నోటీస్… నో వర్రీస్ మేము రెడీ
ఏపీ రాజధానిని అమరావతి నుండి విశాఖ పట్నం మార్చాలి అన్న జగన్ కల గత ఐదేళ్లలో సాకారం అవ్వలేకపోయింది. రాజధాని రైతుల ఆందోళన, న్యాయస్థానాల ఆదేశాలు, ప్రతిపక్షాల పోరాటాలు అన్ని కలిసి జగన్ ను ఆ దిశగా ఒక్కఅడుగు ముందుకు వెయ్యనివ్వవలేదు.
దీనితో ఈ ఎన్నికలలో వైసీపీ విజయం సాధిస్తే విశాఖలోనే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అంటూ నానా హంగామా చేసిన వైసీపీ కళ్ళకు కన్నీళ్లే మిగిలింది. అలాగే తాడేపల్లి ప్యాలస్ నుంచి రుషికొండ ప్యాలస్ కు మకాం మార్చేయాలి అన్న జగన్ కల కలగానే మిగిలిపోయింది.
ఇక ఇటు పక్క కేసీఆర్ విషయానికి వస్తే దేశ రాజకీయాలను తన బిఆర్ఎస్ కారులో బంధించాలి, హస్తం, కమలం కు ధీటుగా జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయంగా గులాబీ ని మార్చేయాలి అనుకున్న కేసీఆర్ కథకు కవిత అరెస్టుతో ఫుల్ స్టాప్ పెట్టారు బీజేపీ పెద్దలు.
ప్రతిపక్షం ఉండకూడదు అన్న కలలు కన్న జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం న్యాయస్థానాలలో పోరాడుతుంటే, దేశ రాజధానిలో గులాబీ జెండా పవర్ చూపించాలి అన్న కథలు రాసుకున్న కేసీఆర్ ఇప్పుడు కూతురు కవిత బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆరాటపడుతున్నారు.
ఒక్క ఫలితం తాలూకా ఖర్మ ఫలం ఇలా వీరిద్దరి కలలు చెరిపేసి, కథలు మార్చేసింది. వైసీపీ తో రాష్ట్రంలో ఏకచక్రాధిపత్యం చెయ్యాలి అనుకున్న జగన్ కు, బిఆర్ఎస్ తో పక్క రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించేయాలి అనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు కనీసం సొంత పార్టీ నేతల నుండే కాదు సొంత కుటుంబ సభ్యుల నుండి ఎదురుగాలే వీస్తుంది.