శత్రువు దగ్గర కూడా పాఠాలు నేర్చుకోవచ్చు.. తప్పుకాదు!

Jagan Faces Criticism for Staying Away from Public

ఏపీలో ప్రభుత్వాలు మారి అప్పుడే ఏడాదిన్నర కావస్తోంది! ఈ ఏడాదిన్నరలో కూటమి ప్రభుత్వం ఏమేమి చేసిందో బాగానే చెప్పుకుంటోంది.

ఒకప్పుడు ఉద్యోగ నియామక పత్రాలు సంబంధిత శాఖల పనిగా ఉండేది. నియామక పత్రాలను అభ్యర్ధులకు పోస్టులో పంపిస్తుండేవారు. కానీ ఇప్పుడు ఇదీ ఓ పెద్ద ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమంగా మారింది. డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ ఇందుకు ఓ చక్కటి ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు చేసిన పని గురించి గట్టిగా నొక్కి చెప్పుకోవడం, దానిని ఓట్ల రూపంలోకి మార్చుకోవడం తప్పనిసరి అయియింది కనుక. అదీగాక చేసిన పని గురించి చెప్పుకోవడం తప్పు, నేరం కాదు. కనుక ఇప్పుడిది సర్వసాధారణమైంది.

ADVERTISEMENT

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈవిదంగా దూసుకుపోతుంటే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షపార్టీ హోదా కావాలని పట్టుబడుతూ శాసనసభ సమావేశాలకు రాకుండా తాడేపల్లి ప్యాలస్‌లోనే కాలక్షేపం చేస్తున్నారు.

పోనీ ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నాయకుడుగా సమర్ధంగా పోరాడుతున్నారా? పార్టీ నేతలు, కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేస్తున్నారా? అంటే కాదని చెప్పుకోవలసి వస్తుంది.

జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌ నుంచి బయటకు రాకుండా ప్యాలస్‌ రాజకీయాలు చేస్తుండటాన్ని రాజకీయ విశ్లేషకులే కాదు ప్రజలు కూడా తప్పు పడుతున్నారు.

కేసీఆర్‌ వృదాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా ఫామ్‌హౌసులో నుంచి బయటకు రాలేకపోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ జగన్‌ తాను యువకుడిని, మరో 25-30 ఏళ్ళు రాజకీయాలలో ఉంటానని చెప్పుకుంటునప్పుడు, ప్రజలు, పార్టీ కార్యకర్తల మధ్యకు రావాలి కదా? ప్రజా సమస్యల పరిష్కారానికి జగన్‌ తాను ముందుండి ప్రభుత్వంతో పోరాటాలు చేయాలి కదా?

కానీ ప్రజల మధ్యకు వస్తే ప్రాణ భయం ఉందనో లేదా కూటమి నేతల అవమానాలు, అవహేళనలు భరించాల్సివస్తుందని జగన్‌ భయపడుతున్నట్లయితే, రాజకీయాలలో ఏవిదంగా రాణించగలరు?

తనకంటే వయసులో చాలా పెద్దవారైన సిఎం చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజలు, పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల మద్య లేకుంటే పారిశ్రామిక సదస్సులు, సమావేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ వయసులో కూడా సిఎం చంద్రబాబు నాయుడు ఇంత చురుకుగా వ్యవహరిస్తున్నప్పుడు యువకుడైన జగన్‌ మరెంత చురుకుగా ఉండాలి?కానీ ఏం చేస్తున్నారు?

రాష్ట్రంలో వైసీపీ పోరాడేందుకు అనేక ప్రజా సమస్యలున్నాయి. కానీ జగన్‌ తనకు, తన పార్టీకి రాజకీయ మైలేజ్ ఎక్కువ లభిస్తుందనుకునే వాటినే ఎంపిక చేసుకొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుంటారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాడాలనుకోవడం ఇటువంటిదే.

రాష్ట్రంలో కోట్లాదిమంది సామాన్య, మద్య తరగతి ప్రజలకు, ముఖ్యంగా గ్రామాలలో నివసించే ప్రజలు దీనిని ఓ సమస్యగానే చూడరు. రోడ్లు, కాలువలు, విద్యుద్దీపాలు, పించన్లు, విద్య, వైద్య సేవలు, ఛార్జీలు, పన్నులు వంటివే వారికి ముఖ్యం. కనుక జగన్‌ ముందు ప్యాలస్‌ బయటకు వచ్చి, ఇటువంటి ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. లేకుంటే ఈ గ్యాప్‌ కూటమి ప్రభుత్వం తెలివిగా ఉపయోగించుకుంటూ దూసుకుపోతూనే ఉంటుంది.

చివరిగా ఒక మాట: రాజకీయాలు, రాజకీయ పాఠాలు శత్రువు దగ్గర కూడా నేర్చుకోవచ్చు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పధకాలు అమలు చేస్తుండటమే ఇందుకు చక్కటి నిదర్శనం. ఆయన జగన్‌ని చూసే నేర్చుకున్నారు కదా? కానీ ఆయన వద్ద జగన్‌ ఏం నేర్చుకున్నారు? అంటే సమాధానం దొరకదు. ఎందుకు నేర్చుకోలేదు?అంటే అహం అడ్డొస్తుండటం వల్లనే కదా?

ADVERTISEMENT
Latest Stories