రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇందుకు ఇరువురు ముఖ్యమంత్రుల ధోరణే కారణం కావడం విశేషం.
తెలంగాణలో కాంగ్రెస్‌ను కేసీఆర్ బలహీనపరచడం ఓ అతిపెద్ద తప్పు. దాని స్థానంలోకి ప్రవేశించిన బిజెపిని రాష్ట్ర స్థాయిలో నిలువరించగలిగే శక్తిసామర్ధ్యాలు కేసీఆర్‌కి ఉన్నప్పటికీ, మద్యలోకి కేంద్రాన్ని లాక్కురావడం మరో అతిపెద్ద తప్పు. అదే… కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను గౌరవిస్తూ, కాంగ్రెస్‌ను దాని మానాన్న దాన్ని పనిచేసుకోనిచ్చి ఉండి ఉంటే, నేడు ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవే కావు కదా?
ఎందుకంటే, కాంగ్రెస్ బలంగా ఉన్నంత కాలం తెలంగాణలో బిజెపి బలపడే అవకాశం ఉండేది కాదు. అప్పుడు కేసీఆర్‌కి కేంద్రంపై కత్తులు దూయవలసిన అవసరం ఉండేది కాదు. అప్పుడు ఈడీ, సీబీఐ, ఐటి తదితర దర్యాప్తు సంస్థలు తెలంగాణకు వచ్చి ఉండేవే కావు. కానీ కేసీఆర్ ఆలోచనా ధోరణి వలన తెలంగాణ రాష్ట్రం, బిఆర్ఎస్ పార్టీ నేతలు, ఇప్పుడు ఆయన కుమార్తె కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూతురు కల్వకుంట్ల కవిత చిక్కుకొని జైలుకి వెళ్ళబోతోందని కేసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆమెను విచారణకు పిలిచిన ప్రతీసారి ఈ ఆందోళన తప్పడం లేదు. నిన్న ఏకధాటిగా 10 గంటలసేపు ఈడీ ఆమెను ప్రశ్నించింది. మళ్ళీ ఇవాళ్ళ 11.30 గంటలకు హాజరుకావాలని చెప్పింది. కనుక ఈ వ్యవహారం కేసీఆర్ కుటుంబానికి నిద్రలేని రాత్రులనే ముగులుస్తోందని భావించవచ్చు. ఇవన్నీ కేసీఆర్ చేజేతులా తెచ్చిపెట్టుకొన్న సమస్యలే కనుక వీటిలో నుంచి ఏవిదంగా బయటపడాలో ఆయనే ఆలోచించుకోవలసి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఎన్నికల గంట మొగుతుంది. బిఆర్ఎస్ నేతలు గోడ దూకేయవచ్చు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినా కేసీఆర్ రాజకీయంగా ఇన్ని ఇబ్బందులు పడుతుంటే, ఏపీలో కేవలం సంక్షేమ పధకాలతో కాలక్షేపం చేస్తున్న సిఎం జగన్‌కు మరో రకం కష్టాలు చుట్టుముట్టాయి. సొంత కేసులకు తోడు వివేకా హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులతో తిప్పలు తప్పడం లేదు. మూడు రాజధానుల పంచాయతీ సుప్రీంకోర్టులో నలుగుతోంది.
ఈసారి 175 సీట్లు మనవే అనే వైసీపీ ధీమాను పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.56 లక్షల కోట్ల ఘనమైన బడ్జెట్ ప్రవేశపెట్టగలిగింది కానీ ఒకటో తారీకున జీతాలు చెల్లించలేకపోతోంది. ఒకటో తారీకు వస్తే చాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు జీతాలు జీతాలో అంటూ రోడ్లెక్కి పరువు తీసేస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లు ఉద్యోగ సంఘాలు ఉద్యమించడానికి సన్నాహాలు చేసుకొంటున్నాయి. ఉద్యోగుల కంటే ముందు అంగన్ వాడి కార్యకర్తలు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’ అని స్పష్టం చేశారు.
అక్కడ తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్‌ని నిర్వీర్యం చేసి చేజేతులా శక్తివంతమైన బిజెపిని తెచ్చుకొని బాధలు పడుతుండటం కళ్ళారా చూస్తూ కూడా సిఎం జగన్ కేసీఆర్‌నే ఫాలో అవుతుండటం విస్మయం కలిగిస్తుంది. ఏపీలో వైసీపీ తప్ప మరో పార్టీ ఉండకూడదనుకొంటూ టిడిపిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు చేయని ప్రయత్నాలు లేవు.
కానీ, టిడిపికి చంద్రబాబు నాయుడు వంటి బలమైన, అనుభవం కలిగిన నాయకుడు ఉన్నారు. కనుక టిడిపి కనుమరుగవలేదు. అయ్యుంటే నేడు టిడిపి స్థానంలో బిజెపి నిలబడి ఉండేది. అంటే ఓ విదంగా వైసీపీ ప్రభుత్వాన్ని టిడిపియే ఓ కాపు కాస్తోందని చెప్పవచ్చు. కనుక టిడిపికి చంద్రబాబు నాయుడు అధినేతగా ఉండటం వైసీపీ అదృష్టమే అనుకోవచ్చు.
అయితే జీవో నంబర్:1, మూడు రాజధానుల పేరుతో ఆడుతున్న రాజకీయ చదరంగం, సంక్షేమ పధకాలనే నమ్ముకొని ఎన్నికలలో విజయం సాధించగలమనే భ్రమ వంటివి వైసీపీ ఆయువుని తగ్గిస్తున్నాయని చెప్పక తప్పదు. అదే ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను గౌరవిస్తూ అమరావతి నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలుగా చేసుకొని సాధారణ పాలన చేసినా వచ్చే ఎన్నికలలో నాలుగు పార్టీల మద్య పోటీ జరిగి ఆ పోటీలో వైసీపీ మరోసారి గెలిచే అవకాశం ఉండేది. ఒకవేళ ఓడిపోయినా భవిష్యత్‌లో మరోసారి గెలిచి అధికారంలోకి రాగలిగి ఉండేది. కానీ 175 సీట్ల భ్రమలో కూర్చొన్న కొమ్మనే వైసీపీ నరుక్కొంటోందని చెప్పక తప్పదు.



