రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా వ్యవహరిస్తుంటాయి… అచ్చం మనుషులు చేతిలో డబ్బునప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ప్రవర్తించినట్లే!
వైసీపీ ఓటమికి ఈవీఎంలే కారణమని జగన్ ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత వైసీపీ నేతలు తాపీగా మరో వంద కారణాలు చెప్పారు. అది వేరే విషయం.
దాదాపు 20 నెలల తర్వాత పరకాల ప్రభాకర్ చేత 2024 పోలింగ్-ఓటింగ్ శాతం లెక్కలు రీవైండ్ చేయించారు. ఇప్పుడే ఎందుకు? అప్పుడే ఈ క్యాసెట్ ఎందుకు వేయలేదు?అనే ధర్మ సందేహాలను పక్కన పెడితే, జగన్ ఓ విషయం బాగా గ్రహించినట్లే ఉన్నారు.
చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్, టీడీపి-జనసేనలు ఏదో రోజు కొట్టుకొని బ్రేకప్ చెప్పేసుకొని ప్రభుత్వాన్ని కూల్చేసుకుంటారనే ఆశ జగన్‌లో సన్నగిల్లినట్లే ఉంది.
వారిద్దరూ కలిస్తేనే వైసీపీ కొంప మునుగుతుందని ఆందోళన చెందిన జగన్, ఇప్పుడు వారి బంధం ఇంకా బలపడితే తనకు ఎన్నటికీ ‘సెకండ్ చాన్స్’ రాదని ఆందోళన చెందుతుండటం సహజమే.
కనుక ప్లాన్-బీలో భాగంగా రాంబాబుకి ప్రమోషన్ ఇచ్చి కూటమి ప్రభుత్వంపైకి వదిలారు. ఆ టైగర్ అటు నుంచి నమిలేస్తుంటే, ఇటు నుంచి పరకాల, ఉండవల్లి, సుబ్రహ్మణ్యం వంటి మేధావులతో ప్లాన్-సి కూడా అమలు చేస్తున్నట్లనిపిస్తోంది. ఓ రాజకీయ పార్టీని నడిపించే వ్యక్తి ఇన్ని ఆలోచనలు, వ్యూహాలు చేయడం చాలా అవసరమే.
కానీ జగన్, వైసీపీ నేతలు ఇంకా గమనించారో లేదో… 2019 ఎన్నికలలో అంతా సవ్యంగా పనిచేసిన ఎన్నికల మెకానిజం 2024 ఎన్నికలలో తేడా కొట్టడం నిజమే అయితే, 2029 ఎన్నికలలో కూడా ఇదే కాంబినేషన్‌లు… అవే ఈవీఎంలు, టాప్ టూ బాటమ్ అదే అధికారులు ఉంటారు కదా?
అధికార యంత్రాంగం అంతా చేతిలో ఉన్నప్పుడే 2024లో గెలవలేనప్పుడు, ప్రత్యర్ధి చేతిలో అధికారం, ఈ మెకానిజం అంతా ఉన్నప్పుడు మరి 2029 ఎన్నికలలో ఎలా గెలుస్తారు?
ఇప్పటికే ప్లాన్-ఏ, బీ, సీలు వాడేస్తున్నారు కనుక 2024కి ప్లాన్- డీ,ఈ, ఎఫ్… ఎక్స్, వై, జెడ్ ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? జస్ట్ ఆస్కింగ్!






