ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి దేశంలోకే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రెటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) కలిసి బుదవారం ఓ నివేదికను ప్రకటించాయి. దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించిన్నట్లు సదరు సంస్థలు తెలిపాయి.
దేశంలో 30 మంది ముఖ్యమంత్రులకు కలిపి ఆస్తులు విలువ మొత్తం రూ.1,018.86 కోట్లు కాగా దానిలో 50.09% అంటే రూ.510.38 కోట్లు ఒక్క ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికే ఉన్నాయని పేర్కొన్నాయి. మిగిలిన 29 మంది ముఖ్యమంత్రులవి ఆస్తుల విలువ రూ.508 కోట్లు అని పేర్కొంది. అంటే 29 మంది ముఖ్యమంత్రుల కంటే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరి ఆస్తుల విలువే ఎక్కువన్న మాట!
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం దేశంలో అందరి కంటే తక్కువగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేవలం రూ.15 లక్షలు ఆస్తి ఉండగా, అత్యధికంగా సిఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని పేర్కొంది. సిఎం జగన్ తర్వాత స్థానాలలో అరుణాచల్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ రూ.163 కోట్లు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.63 కోట్లు, తెలంగాణ సిఎం కేసీఆర్ రూ.23.55 కోట్లు ఆస్తులు కలిగి ఉన్నారని నివేదికలో పేర్కొన్నాయి.
అయితే ఏనుగు బయటకు ప్రదర్శించే దంతాలు… లోపల ఆహారం నమిలి తినే దంతాలు వేరన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నవి అసలు ఆస్తుల విలువలో 4-5% కూడా ఉండవనేది బహిరంగ రహస్యమే. కనుక ఈ రెండు సంస్థలు సర్వే చేసి కనిపెట్టిన ఆస్తులకు కనీసం 100 రెట్లు ఉండవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో రూ. 400-500 కోట్ల ఆస్తి ఉన్న రాజకీయ నాయకుడంటే మద్యతరగతివాడిగానే రాజకీయాలలో పరిగణిస్తుంటారు.
ఒక్కో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికకే వంద-రెండొందల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు వారి ఆస్తులు ఎంతుండాలి?అని ఆలోచిస్తే అర్దమవుతుంది. దేశంలో చాలా మంది రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి రూ.4-5000 కోట్ల ఆస్తులు, రూ.1,500-3000 కోట్ల వ్యాపారాలు చాలా కామన్. రోజూ టీవీ, పేపర్లలో వస్తున్న వార్తలు ఫాలో అయ్యేవారికి ఈ విషయం తెలుసు.
సిఎం జగన్ విషయానికి వస్తే ఆయన తన సంస్థలన్నిటినీ లాభాల బాటలో నడిపిస్తుంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా సాక్షి మీడియా కనబడుతోంది. వైసీపీ ఏపీలో అధికారంలోకి రాకమునుపు అది అప్పులలో మునిగి తేలుతుండేది కానీ ఏడాది తిరిగేసరికి లాభాల బాటలో దూసుకుపోతోంది. తన సంస్థలను విజయవంతంగా లాభాల బాటలో నడిపిస్తున్న జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం ఎందుకు అప్పుల పాలు చేశారనే సందేహం కలగడం సహజం. దానికి సమాధానం అందరికీ తెలుసు.
చివరాఖరుగా తేలింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం. అప్పులలో మునిగిపోతోంది. కానీ దానిని నడిపిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి దేశంలోకే అత్యంత ధనవంతుడు. సక్సస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా!



