దేశంలో ఉగ్రదాడులు జరిగినప్పుడో లేదా భారత్-పాక్ మద్య ఘర్షణలు జరిగినప్పుడో లేదా మరో సందర్భంలోనో దేశంలో ముస్లింలు తమ దేశభక్తిని నిరూపించుకోవలసి వస్తుంటుంది. ఇది చాలా శోచనీయం కానీ తప్పడం లేదు.
అటువంటి సందర్భాలలో మజ్లీస్ అధినేత ఓవైసీ వంటివారు మువ్వన్నెల జెండాలు చేత పట్టుకొని భారత్ తరపున మాట్లాడుతుండటం అందరూ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే!
సిఎంగా ఉన్నప్పుడు తిరుమల శ్రీవారికి చేయకూడని అపచారాలన్నీ చేసినందున, వాటిని కూటమి ప్రభుత్వం బట్టబయలు చేస్తుండటంతో ఇప్పుడు జగన్&కో అందరూ తమకి తిరుమల శ్రీవారిపై చాలా భక్తి, గౌరవం ఉన్నాయని, హిందూమతం పట్ల చాలా గౌరవం ఉందని నిరూపించుకోవాల్సి వస్తోంది.
భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం క్రీస్టియన్ మతం అవలంభిస్తుందనే విషయం అందరికీ తెలుసు. దేశంలో మత స్వేచ్చ అందరికీ ఉంది. కనుక అదేమీ తప్పు, పాపం, నేరం కావు.
ఆ మతాన్ని అనుసరించే జగన్ సిఎంగా ఉన్నప్పుడు భూమనని టిటిడీ పగ్గాలు అప్పగించడమే ఓ పొరపాటు. తిరుమల శ్రీవారిపై ఏమాత్రం నమ్మకం లేనివారికి భక్తి, గౌరవం ఉంటాయని ఎలా ఆశించగలం? అందుకే తిరుమలలో అన్ని అపచారాలు జరిగాయి.
గతం గతః అని ప్రజలు వారిని 11 సీట్లతో వదిలేసినా, స్వామివారు క్షమించినట్లు లేదు. అందుకే వైసీపీ నేతలు చేతులు ఎంతగా కడుక్కుంటున్నా కల్తీ నెయ్యి జిడ్డు వదలడం లేదు.
కనీసం ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ఉంటే బాగుండేది. కానీ ‘కల్తీ గేమ్స్’ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దీంతో ఇంకా ఇంకా ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించినట్లే ఉన్నారు.
కనుక భూమన తన కుమార్తె వివాహాన్ని హిందూసాంప్రదాయం ప్రకారం జరిపించి సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పెట్టుకున్నారు. దేనికి? హిందూమతంపై గౌరవం ఉందని చాటుకోవడానికే కదా?
తాజాగా జగన్ కూడా కడప జిల్లా నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయం ప్రకారం పట్టుబట్టలు ధరించి నుదుట బొట్టు పెట్టుకొని ఈ పూజలో పాల్గొన్నారు. స్వామివారి తీర్ధ ప్రసాదాలను స్వీకరిస్తున్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు, ఈ వార్త ఆయన సొంత మీడియాలో, సోషల్ మీడియాలో పడ్డాయి. మామూలే!
తద్వారా తాను హిందూమతాన్ని చాలా గౌరవిస్తాననే సందేశం హిందువులకు, ముఖ్యంగా తిరుమల స్వామివారి భక్తులకు పంపిస్తున్నట్లు భావించవచ్చు. పనిలో పనిగా సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ల వాదనలకు, ప్రయత్నాలకు చెక్ పెట్టాలని జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.
కానీ అడుసు తొక్కనేల కాలు కడుగనేల అన్నట్లు తిరుమల శ్రీవారి విషయంలో ఇన్ని తప్పులు, అపచారాలు చేయడం దేనికి? ఇప్పుడు హిందూ ధర్మ రక్షకుడుగా నిరూపించుకోవడం దేనికి?
కల్తీ నెయ్యి తర్వాత హిందువులు ఇలాంటి డ్రామాలు నమ్ముతారా?ఫలిస్తాయా?
ముఖ్యంగా జగన్‌నే నమ్ముకున్న అన్యమతస్తులకు దీంతో ఎటువంటి సందేశం వెళుతుంది? వారి నమ్మకాన్ని కూడా కోల్పోతే? మన పరిస్థితి ఏమిటి? అని ఆలోచించుకోవాలి కదా?
నందిపల్లిలో నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో #YSJagan ప్రత్యేక పూజలు pic.twitter.com/yth8BMimoA
— M9 NEWS (@M9News_) February 25, 2026






