JanaSena_10th_Anniversary_Machilipatnam_Perni_Naniఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావసభ నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తొమ్మిదేళ్ళ క్రితం పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు, ముఖ్యంగా వైసీపీ నుంచి అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకువెళుతున్నారు. కనుక ఈసారి జనసేన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నాము. మచిలీపట్నంలో 34 ఎకరాలలో నిర్వహించబోయే భారీ బహిరంగసభకు మా పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మంగళగిరి నుంచి తన వారాహి వాహనంలో బయలుదేరివస్తారు. ఈ సభా వేదికకి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరు ఖరారు చేశాము.

రాష్ట్రంలో అరాచక పాలన చేస్తూ, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వైసీపీ కబంద హస్తాల నుంచి విడిపించాల్సిన బాధ్యత మాపై ఉందని భావిస్తున్నాము. అందుకే ఈ బహిరంగసభలో మా పార్టీ అధినేత రాబోయే ఎన్నికలకి సంబందించి కొన్ని ముఖ్యనిర్ణయాలు ప్రకటిస్తారు. ఈ సభకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా అనుమతిస్తారనే భావిస్తున్నాము. మేము కూడా సభలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటాము,” అని చెప్పారు.

Also Read – వందల కోట్లు బడ్జెట్‌తో రెండు మూడేళ్ళు ఓ సినిమా తీస్తే… గ్రేట్!

మొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి తెనాలిలో పర్యటించినప్పుడు టిడిపి, జనసేనలని 175 స్థానాలలో పోటీ చేయాలని సవాలు విసిరారు. దానిపై నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ, “ముందు జగన్‌ 175 నియోజకవర్గాలలో పరదాలు లేకుండా పర్యటించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము,” అంటూ ప్రతిసవాల్ విసిరారు.

మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ బహిరంగసభలో నిర్వహించడానికి బలమైన కారణమే ఉంది. వైసీపీలో పవన్‌ కళ్యాణ్‌ని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తున్నవారిలో పేర్ని నాని మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. అదీగాక మచిలీపట్నంలో కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. కనుక మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావసభ నిర్వహించడం ద్వారా పేర్ని నానికి సవాలు చేసినట్లు ఉంటుంది. అలాగే కాపు సామాజిక వర్గ ప్రజలకు జనసేన బలం ఏమిటో చూపి వారిని పార్టీవైపు ఆకర్షించవచ్చని జనసేన ఆలోచనకావచ్చు.

Also Read – జగన్‌ కోసం ప్యాలస్‌ కట్టుకుంటే… అదే విశాఖ అభివృద్ధి!

గత ఏడాది మంగళగిరిలో జనసేన ఆవిర్భావసభ నిర్వహించుకొనేందుకు ప్రయత్నించగా వైసీపీ ప్రభుత్వం అడ్డుపడింది. అప్పుడు ఇప్పటం గ్రామంలో ఓ రైతు తన పొలం ఇవ్వడంతో అక్కడే నిర్వహించుకోవలసి వచ్చింది. కానీ జనసేన సభకి భూమి ఇచ్చినందుకు వైసీపీ ప్రభుత్వం రోడ్లు వెడల్పు పేరుతో ఇప్పటం గ్రామంలో పలువురి ఇళ్ళ ప్రహారీ గోడలు కూల్చివేయించింది.

కనుక ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నట్లుగా మచిలీపట్నంలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు జనసేన సిద్దం అవుతోంది. అయితే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్‌ పవన్‌ కళ్యాణ్‌ని బహిరంగసభలలోనే ద్వేషిస్తున్నప్పుడు అధికారులు జనసేన సభకి అనుమతిస్తారా? అంటే అనుమానమే. ఇవ్వకపోతే జనసేన ఏం చేయబోతోందో చూడాల్సిందే.

Also Read – ఓటమిని అంగీకరించకపోతే పోయే… కనీసం బుద్ధి మారలేదే!