పదవి అధికారం కోల్పోయి రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసులోనే కాలక్షేపం చేస్తున్నా, నేటికీ ప్రాంతీయవాదం, తెలంగాణ సెంటిమెంటునే నమ్ముకొని అదే పద్దతిలో పార్టీని నడిపిస్తున్నారు.
తండ్రి చేత బయటకు గెంటివేయబడిన కల్వకుంట్ల కవిత కూడా తండ్రి బాటలోనే సాగుతున్నారు. నేటికీ ‘కల్వకుంట్ల’ బ్రాండ్ నేమ్ వాడుకుంటున్న కవిత, టీఆర్ఎస్ పార్టీ పేరుని కూడా తీసేసుకున్నారు.
అలాగే బీఆర్ఎస్ పార్టీ వాదనలు కూడా అందిపుచ్చుకొని సిఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి మాట్లాడటం కూడా బాగానే అలవరుచుకున్నారు.
తాజాగా తెలంగాణలో నారాయణ చైతన్య కాలేజీల గురించి, ఐటి కంపెనీలలో ఆంధ్రా ఉద్యోగుల గురించి, ప్రభుత్వ శాఖలలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారులు, ఉద్యోగుల పెత్తనం గురించి ప్రస్తావిస్తూ, తెలంగాణ యువతకు అన్యాయం జరిగిపోతున్నా ప్రశ్నించేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
‘టిటిడీలో తెలంగాణ సభ్యులు ఉండవచ్చు కానీ యాదాద్రిలో ఆంధ్రాకు చెందిన కొణిదెల సురేఖ దేనికి?’ అని కవిత ప్రశ్నించడం విచిత్రంగా ఉంది.
తెలంగాణవాదంతో కేసీఆర్ సిఎం కాగలిగారు కనుక తాను కూడా ఇదే పద్దతిలో సిఎం కావచ్చునని భావిస్తున్నట్లున్నారు.
కానీ ఆమె గమనించాల్సిన విషయాలు ఏమిటంటే, తెలంగాణలో యూపీ, బిహార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండవచ్చు.. ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. అలాగే దేశంలో అన్ని రాష్ట్రాలవారు తెలంగాణలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవచ్చు.. కానీ ఒక్క ఆంధ్రావాళ్ళు చేస్తేనే అభ్యంతరం.. దేనికి?
అలాగే తెలంగాణ వాసులు బెంగళూరు, పూణే తదితర నగరాలలో, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు చేసుకోవచ్చు.. కానీ తెలంగాణలో ఆంధ్రావాళ్ళు పని చేయకూడదు… చేస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నట్లేనా?
ఇటీవలే ఆమె 14 దేశాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను నియమించారు. అంటే ఆయా దేశాలలో తెలంగాణవాసులు పనిచేయవచ్చు. అక్కడా వారు టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. కానీ టీడీపి, జనసేనలు తెలంగాణలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నట్లు కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంటారు.
తెలంగాణలో కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయడం ఏవిధంగా ఎదుర్కోవాలో తెలీని పరిస్థితిలో ఉన్నారు కనుకనే కల్వకుంట్ల కవిత ఇలాంటి సంకుచిత ప్రాంతీయ వాదంతో ముందుకు సాగుతున్నారు. ఈవిధంగా ఎన్నికలలో గెలిచి తెలంగాణ సిఎం అవ్వాలని కలలు కంటున్నారు.
తన తండ్రి హయంలో తెలంగాణ రాష్ట్రం, ప్రజలు దోపిడీకి గురయ్యారని ఆమె స్వయంగా చెప్తున్నారు కదా?ఆమె కుటుంబమే దోపిడీకి పాల్పడి, ఇంకా ఆంధ్రావాళ్ళు తెలంగాణని దోచేసుకుంటున్నారన్నట్లు మాట్లాడటం మాటకారితనం తప్ప మరొకటి కాదు.
కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ పార్టీలను ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచిస్తే, ఎప్పటికైనా ఆమె కల నెరవేరే అవకాశం ఉంటుంది. లేకుంట ఆటలో అరటిపండులా మిగిలిపోక తప్పదు.
Chiranjeevi Familyపై Kavitha BIG Attack!
Andhra Person’ను Telangana Temple Boardలో ఎందుకు నియమించారు?
–#KalvakuntlaKavitha #Chiranjeevi pic.twitter.com/yTHNqeCZlT
— M9 NEWS (@M9News_) August 27, 2026





