బిజెపికి గుడ్ బై చెప్పేసిన కన్నా లక్ష్మినారాయణ ఈ నెల 23న చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, “టిడిపిలో నా స్థానం ఏమిటో చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారు. ఆయన ఏ బాధ్యత అప్పగించినా నాకు సమ్మతమే. నిన్న గన్నవరం టిడిపి కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేయడం జగన్ పాలనలో అరాచకత్వానికి పరాకాష్టగా భావిస్తున్నాను. కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటి వైసీపీ నేతలు పెట్రేగిపోతుంటే సిఎం జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండిపోవడం గమనిస్తుంటే ఆయన ప్రోద్బలంతోనే వారు రెచ్చిపోతున్నారని అర్దం అవుతోంది. ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేశారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందో?
వచ్చే ఎన్నికలలో తమ పార్టీ 175 సీట్లు గెలుచుకొంటుందని సిఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెపుతుంటారు. మరి అంత నమ్మకమున్నప్పుడు ప్రతిపక్ష నేతలని అరెస్ట్ చేయడం, వారి పాదయాత్రలని అడ్డుకోవడం, టిడిపి కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం దేనికి? నిజంగా గెలుస్తామనే నమ్మకం లేకపోవడం వలననే కదా?
సంక్షేమ పధకాలతో ఓట్లు రాలవని సిఎం జగన్మోహన్ రెడ్డి గ్రహించబట్టే కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటి వైసీపీ నేతలని ప్రతిపక్షాలపై ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారనుకోవలసి ఉంటుంది. కానీ ఇటువంటి దౌర్జన్యాలతో భయపెట్టాలని ప్రయత్నిస్తే ప్రజలే తగినవిదంగా బుద్ధి చెపుతారని మరిచిపోరాదు.
పోలీసులు కూడా వైసీపీ అరాచకాలని అడ్డుకోకుండా ప్రేక్షకపాత్రకి పరిమితమవుతున్నారని గన్నవరం దాడులలో స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి బిహార్ కంటే అధ్వానంగా మారిపోతుండటం చాలా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలని, ప్రజలని కాపాడాలి కానీ వైసీపీ నేతలని కాదు.
విశాఖ రాజధాని పేరుతో వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారు. కానీ ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉంటుంది. అమరావతిని కాపాడుకోవాలంటే ప్రజలు టిడిపిని గెలిపించుకోకతప్పదు,” అని కన్నా లక్ష్మినారాయణ అన్నారు.



