హిందీలో ‘బాహుబలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనపడడం లేదు. కరణ్ జోహార్ తాజాగా దర్శకత్వం వహించిన “యే దిల్ హై ముష్కిల్” సినిమా విడుదల సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించడమే దీనికి కారణం. పాకిస్థాన్ నటీనటులు నటించడంతో సినిమా ప్రదర్శనను అనుమతించమని ఎమ్మెన్నెస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకో ప్రకటన చేస్తూ తీవ్ర ఉత్కంఠ రేపగా, ఈ క్రమంలో తీవ్రమైన లాబీయింగ్ చేసిన కరణ్ జొహార్ ఎమ్మెన్నెస్ ను తన దారిలోకి తెచ్చుకున్నారు.
ఆ పార్టీ అధినేత రాజ్ ఠాక్రేతో సమావేశమై ఒప్పించారు. దీంతో తన సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనని ఆయన భావించారు. దీంతో థియేటర్ల యాజమానులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని సమాచారం పంపించారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ధియేటర్ల యాజమాన్యం మాత్రం సినిమా ప్రదర్శనకు ఒప్పుకోమంటూ కరణ్ జోహార్ కు లేటెస్ట్ ట్విస్ట్ ఇవ్వడంతో తల పట్టుకోవడం, కరణ్ వంతయ్యింది.
పాకిస్తాన్ నటులు ఉన్న “యే దిల్ హై ముష్కిల్” సినిమాను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. తొలుత ఎమ్మెన్నెస్ ప్రకటనలు చేసినప్పటికీ తరువాత అది ప్రజా ఉద్యమమైందని, దర్శకుడితో ఆయన ఏం చర్చలు జరిపారో తమకు తెలియదని, అయినా ఇందులో పాక్ నటులుండడం వల్లే దీనిని నిషేధించామని స్పష్టం చేశారు. ఎవరు చెప్పినా తాము ఈ సినిమాను తమ థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేదని వారు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 400 సింగిల్ థియేటర్ల యజమానులు ఈ సినిమా విడుదలకు అంగీకరించని సంగతి తెలిసిందే.



