బిఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత ఊడితే ఎంత.? బంగారు తెలంగాణ అంటే హరీష్, సంతోష్ కుటుంబాలు బంగారం అవ్వడం కాదుగా.? కాళేశ్వరం అవినీతి పై కేసీఆర్ కి సిబిఐ నోటీసులు ఆ పాపం ఎవరిది.? ఇలా అటు బిఆర్ఎస్ ని ఇటు కేసీఆర్ ని ఇరుకున పెట్టేలా కవిత చేసిన విమర్శనా బాణాలు బిఆర్ఎస్ ని చాల బలంగా తాకాయి.
అలాగే బిఆర్ఎస్ ని బీజేపీ లో విలీనం చేసేందుకు పార్టీ లోనే కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరంజన్ రెడ్డి అవినీతి కనిపించదా.? హరీష్ రావు దోపిడీ పట్టదా.? బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో సామజిక న్యాయం జరగలేదు అంటూ కవిత చేసిన రాజకీయ ఆరోపణలు కేసీఆర్ ని గుచ్చాయి.
అయితే కవిత విమర్శలకు, ఆరోపణలకు బిఆర్ఎస్ హరీష్ పక్షాన్నే నిలబడింది, కవిత కే సస్పెన్షన్ వేటు వేసింది. దీనితో పూర్తిగా రాజకీయ స్వేచ్ఛ పొందిన కవిత జాగృతి పేరు మీద రాజకీయం చేస్తూ జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్న కవిత ఈసారి మరో బిఆర్ఎస్ నాయకుడిని టార్గెట్ చేస్తూ ఆయన మీద అవినీతి మరకలు వేసింది. పూలమ్మినా, పాలమ్మినా అంటూ ఫేమస్ అయిన మేడ్చర్ల ఎమ్మెల్యే మల్లారెడ్డి టార్గెట్ గా కవిత ఆరోపణలు గుప్పించారు.
ఒకప్పుడు మేడ్చర్ల లో పాలు, పూలు అమ్మిన వ్యక్తిని అని చెప్పుకునే మల్లారెడ్డి ఒక ఎంపీ గా, ఎమ్మెల్యే గా, మంత్రిగా తన నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమిటి.? కేవలం ఆయన కాలేజీలు, యూనివర్సిటీలను డెవలప్ చేసుకున్నాడే కానీ నియోజకవర్గ సమస్యల పరిష్కారం పై ద్రుష్టి పెట్టలేదంటూ మండిపడ్డారు.
కనీస మౌలిక వసతుల కల్పనలో కూడా మల్లారెడ్డి ఫెయిల్ అయ్యారంటూ ఆరోపించిన కవిత మల్లారెడ్డి తన అధికారంతో పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడ్డారంటూ మరో బిఆర్ఎస్ ముఖ్య నాయకుడిని టార్గెట్ చేసారు. హరీష్ తో మొదలు పెట్టిన కవిత ఆ తరువాత సంతోష్, అటు పైన నిరంజన్ రెడ్డి వరకు వెళ్లారు.
ఇక ఇప్పుడు మల్లారెడ్డి కేంద్రంగా విమర్శలు వినిపించారు. అలాగే కాంగ్రెస్ మంత్రి, మాజీ బిఆర్ఎస్ ఖమ్మం నేత తుమ్మల పై కేసీఆర్ అనుసరించిన విధానాలను, ఆయన విషయంలో పార్టీ వ్యవహరించిన తీరుని కూడా కవిత మీడియా ముఖంగా ఎండగట్టారు.
అలాగే ఈ రోజు నేను బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చాను, రేపటి రోజున నా ఈ పరిస్థితే కేటీఆర్ కి రావచ్చు కేసీఆర్ కి ఎదురవచ్చు అంటూ భవిష్య వాణి వినిపించారు. కవిత ఇంతలా బిఆర్ఎస్ పార్టీ నేతలను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నా బిఆర్ఎస్ ఇప్పటికి కవిత విషయంలో ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా వేచి చూసే ధోరణినే అవలంబిస్తుంది.
హరీష్ నుంచి సంతోష్, సంతోష్ నుంచి నిరంజన్ రెడ్డి, నిరంజన్ నుంచి ఇప్పుడు మల్లారెడ్డి వరకు కవిత వచ్చారు అంటే రేపటి రోజున కవిత చాప కింద నీరు మాదిరి ప్రతి ఒక్క బిఆర్ఎస్ నాయకుడి రాజకీయ జీవితాన్ని తవ్వి తీయవచ్చు.
అంటే కవిత రాజకీయం చిన్న సమస్య అన్నట్టుగా కొట్టివేసి ధోరణిలా కాకుండా కవిత రాజకీయం వెనుక పెద్ద కథే ఉంది అనే ధోరణిలో కవిత విమర్శలకు బిఆర్ఎస్ ఇప్పటికైనా గట్టి కౌంటర్ ఇవ్వాలంటూ గులాబీ సేన ఆశ పడుతుంది.






