ఏపీలో ఏం జరుగుతోందయ్యా? అని ప్రశ్నిస్తే ‘రాజకీయాలు’ అని సమాధానం చెప్పుకోవాలి. అదే… తెలంగాణలో ఏం జరుగుతోందయ్యా? అని ప్రశ్నిస్తే ‘అభివృద్ధి’ అని చెప్పుకోవచ్చు.
ఏపీలో స్పెషల్ ఏంటి?అంటే కొండంత అప్పులు, ‘గుండు కొట్టిన కొండలకు దుప్పట్లు’ అని చెప్పుకోవచ్చు. కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గత ఏడాది మార్చి 31నాటికి ఏపీ ఆర్ధిక పరిస్థితి, రెవెన్యూ, రవాణా తదితర రంగాల పరిస్థితులపై నివేదికను సమర్పించింది.
ఏపీ ప్రభుత్వం మరింత ఎక్కువ రుణాలు తీసుకొనేందుకు వీలుగా 2021-2022లో ఏపీ ఎఫ్ఆర్‌బీఎం చట్టాన్ని సవరించుకొంది. బడ్జెట్‌లో పేర్కొనని రుణాలు రూ.1,18,394 కోట్లు అని పేర్కొంది. ఇక డిస్కమ్‌లకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు, సాగునీటి ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు కలిపి రూ.17,804 కోట్లు అని పేర్కొంది.
2021-2022నాటికి ఏపీ అప్పులు రూ.3,72,503 కోట్లు. దీనిలో 90 శాతం అప్పులకు 13.99% వడ్డీ చెల్లిస్తోంది. గడచిన 5 ఏళ్లలో తలసరి రుణం 71% పెరిగింది. బడ్జెట్లో చూపని రుణాలను కూడా కలిపుకొంటే రాష్ట్రంలో ఒక్కో పౌరుడు రూ.92,797 భారం పడుతుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పధకాల కోసం మంజూరైన రూ.6,356 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ సమకూర్చుకోలేకపోవడం వలన ఆ సొమ్ము మురిగిపోయిందని కాగ్ నివేదికలో పేర్కొంది. వైఎస్సార్ గృహవసతి పధకంలో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ళు లేదా స్థలాల కోసం చేసిన రూ.688 కోట్ల ఖర్చును రెవెన్యూ వ్యయంగా చూపించాల్సి ఉండగా మూలధన వ్యయంగా తప్పుగా చూపించిందని కాగ్ నివేదికలో పేర్కొంది. ఇదీ… క్లుప్తంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి!ఇంకా ఉద్యోగుల సొమ్ము వాడేసుకోవడం, వారికి చెల్లించాల్సిన బకాయిలు వంటి కధలు చాలానే ఉన్నాయని అందరికీ తెలుసు.
తెలంగాణ విషయానికి వస్తే, గత రెండేళ్ళలో రాష్ట్రంలో పెట్టుబడులు 150% వృద్ధి చెందాయని, 7 లక్షల ఐటి ఉద్యోగాలు వచ్చాయని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఛైర్మన్ డిఎస్.రావత్ తాజా నివేదికలో వెల్లడించారు. 2020-2021లో రాష్ట్రానికి రూ.31,274 కోట్లు పెట్టుబడులు రాగా, 2021-2022లో రూ.76,568 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా తెలంగాణలో కొత్తగా మరో 60,000 ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, వ్యవసాయ అనుబంద రంగాలను బలోపేతం చేసుకోవడం వలన కరోనా సమయంలో కూడా 2.2% వృద్ధిరేటు సాధించిందని పేర్కొంది. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలో అంటే 2014-15లో తెలంగాణ ఐటి ఎగుమతుల విలువ రూ.66,276 కోట్లు కాగా, అవి 2021-2022 నాటికి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. దీని వలన ఐటి తదితర రంగాలలో కొత్తగా 3.71 లక్షల ఉద్యోగాలు పెరిగాయని పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ వంటి అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొంటూ ఆయా రంగాలలో కూడా పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షిస్తుండటంతో శరవేగంగా ఆర్ధికాభివృద్ధి సాధిస్తూ, వేలాది ఉద్యోగాలను సృష్టించుకొంటూ దూసుకుపోతోందని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది.
ఆరోగ్య పర్యాటక రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపింది. గత 4-5 ఏళ్ళలో గల్ఫ్, ఆఫ్రికా తదితర దేశాల నుంచి 2 లక్షల మంది హైదరాబాద్‌కు వచ్చి వైద్య చికిత్సలు చేయించుకొన్నారని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది. కనుక ఆరోగ్య పర్యాటక రంగం ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయం సమకూర్చుకొంటోందని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ నివేదికలో పేర్కొంది.
ఈ రెండు వేర్వేరు నివేదికలను చూసినప్పుడు ఏపీ అంటే అప్పులు, తెలంగాణ అంటే అభివృద్ధి అని అర్దమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఈ 5-6 ఏళ్ళలో 17 ఫ్లైఓవర్లు నిర్మించింది. నేడు ఎల్బీ నగర్ వద్ద మరో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కానుంది. కానీ విశాఖను రాజధాని చేస్తామని చెపుతున్న వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో విశాఖనగరంలో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్ కూడా నిర్మించలేకపోయింది.
తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధులతో హైదరాబాద్‌లో మెట్రో కారిడార్‌ను నగరం నలువైపులా విస్తరించుకొంటూపోతుంటే, ఏపీ ప్రభుత్వం విశాఖలో మెట్రోకి ప్రతిపాదనలు కూడా పంపలేదని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నలుదిశలా శరవేగంగా వ్యాప్తిచెందుతుంటే, ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాజకీయ కారణలాతో అమరావతిని పక్కనపడేసి మూడు రాజధానుల పాట పాడుతుండటంతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఇలా చెప్పుకొంటూపోతే ఈ తేడాల గురించి ఓ పుస్తకమే తయారవుతుంది. కనుక సంక్షేమ రాజ్యంలో అందరూ కళ్ళు మూసుకొని ‘ఆల్ ఈజ్ వెల్’ అని పాడుకొంటూ బ్రతికేయక తప్పదు.



