తెలంగాణలో కేసీఆర్‌కి బిఆర్ఎస్ పార్టీ నేతలు జైకొట్టడం సహజమే. అలాగే కేసీఆర్ పాలన మెచ్చి ఆయనకి జైకొట్టే ప్రజలూ తెలంగాణ రాష్ట్రంలో చాలామందే ఉన్నారు. కానీ ఇతర రాష్ట్రాల నేతల చేత కూడా కేసీఆర్ జై కొట్టించుకొంటుండటమే విశేషం.
అయితే వారందరూ కేసీఆర్ నాయకత్వాన్ని చూసి జై కొడుతున్నారనుకోలేము. ప్రధాని నరేంద్రమోడీని, బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్, బిజెపి మతతత్వాన్ని వ్యతిరేకిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్ వంటివారిని, రాజకీయ అవకాశాలు లేక కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న శంకర్ సింగ్ వాఘేలా (గుజరాత్), గిరిదర్ గమాంగ్ (ఒడిశా), కుమార స్వామి (కర్ణాటక), అఖిలేశ్ యాదవ్ (యూపీ), తోట చంద్రశేఖర్ (ఏపీ) వంటి రాజకీయ నిరుద్యోగులని, ఇంకా రైతు సంఘాల నేతలని కేసీఆర్ తెలివిగా ఎంపిక చేసుకొని వారితో సైన్యం నిర్మించుకొనే ప్రయత్నం మొదలుపెట్టారు.
వారిలో ఎవరికీ ప్రధాని పదవి చేపట్టాలనే ఆశ, కోరిక, ఒకవేళ ఉన్నా ఆ సామర్ధ్యం లేకపోవడం మరో ప్రధాన అర్హతగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొన్నప్పుడు మొట్ట మొదట కోల్‌కతా వెళ్ళి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఆ తర్వాత బిహార్ సిఎం నితీశ్ కుమార్‌ని కలిశారు. కానీ వారిద్దరూ ప్రధాని రేసులో ఉండటంతో కేసీఆర్ వారిని దూరంగా ఉంచుతున్నారు.
అంటే తన నాయకత్వాన్ని, తనని ప్రధాని అభ్యర్ధిగా అంగీకరించేవారిని మాత్రమే కేసీఆర్ చాలా తెలివిగా ఎంపికచేసుకొంటున్నారని అర్దం అవుతోంది.
జాతీయ రాజకీయాల కోసం సొంత విమానాన్ని కొనుగోలు చేస్తున్న కేసీఆర్ వద్ద డబ్బుకి కరువు లేకపోవడం కూడా ఇతర రాష్ట్రాల నేతలని బాగా ఆకర్షిస్తోందని చెప్పవచ్చు. కనుక కేసీఆర్‌తో చేతులు కలిపితే ఎన్నికల ఖర్చులకు వెతుక్కోనవసరంలేదని, ఆయనిచ్చే సొమ్ముతో గెలిస్తే కేంద్రంలో చక్రం కూడా తిప్పవచ్చు లేకుంటే తమకి పోయేదేమీ ఉండదనే ఆలోచన రాజకీయ నిరుద్యోగులని కేసీఆర్ ఇంటి ముందు క్యూ కట్టేలా చేస్తోందని చెప్పవచ్చు.
అందుకే కేసీఆర్ పిలవగానే కర్ణాటక నుంచి కుమారస్వామి, యూపీ నుంచి అఖిలేశ్ యాదవ్, ఏపీ నుంచి తోట చంద్రశేఖర్ వంటివారు, పంజాబ్, హర్యానా నుంచి రైతు సంఘాల నేతలు హైదరాబాద్ వచ్చి వాలిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని కేసీఆర్ పదేపదే చెప్పేవారు. దానర్దం ఇదే! నేడు ఖమ్మంలో జరిగే సభకి ఏపీతో సహా వివిద రాష్ట్రాల నుంచి రాజకీయ నేతలు వస్తుండటమే ఇందుకు తాజా నిదర్శనం. బహుశః ఇందుకే బిఆర్ఎస్ సభకి హాజరయ్యేవారందరూ “ప్రీపెయిడ్ నేతలే” అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.



