ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ నుంచి నలుగురు కాదు… దాదాపు 40 మంది టిడిపిలోకి వచ్చేస్తామంటున్నారు. ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని వద్దో పార్టీలో చర్చించుకొని తగిన సమయంలో నిర్ణయం తీసుకొంటాము. మేము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది,” అని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ కోడింగ్ విధానం అమలుచేయడం గురించి మాట్లాడుతూ “రహస్య బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓట్లేశారనే విషయం ఎలా తెలుస్తుంది? సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా మా పార్టీ అభ్యర్ధికి ఓటు వేసి ఉండొచ్చు కదా?కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కోడింగ్ విధానం ద్వారా ఓట్లు వేయించామని, దాని ద్వారా క్రాస్ ఓటింగ్ చేసినవారిని గుర్తించామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. తద్వారా రహస్య బ్యాలెట్ విధానాన్ని వైసీపీ ఉల్లంఘించిన్నట్లు స్పష్టమైంది. క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సప్సెండ్ చేయడం కూడా రహస్య బ్యాలెట్ విధానాన్ని వైసీపీ ఉల్లంఘించిందని స్పష్టం చేస్తోంది. కనుక ఎన్నికల సంఘం వైసీపీపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.
పొత్తుల గురించి మాట్లాడుతూ, “కలిసివచ్చే పార్టీలతో ముందుకు వెళ్ళాలని ఎప్పుడో నిర్ణయించుకొన్నాము కనుక పొలిట్ బ్యూరో సమావేశంలో పొత్తుల గురించి చర్చించలేదు. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్నందున పొత్తుల గురించి తర్వాత ఆలోచిస్తాము. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపిని ఏవిదంగా బలోపేతం చేసుకోవాలనే అంశంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాము. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ప్రజాస్వామ్యం బలంగా ఉన్నప్పుడే రాజకీయపార్టీలు మనుగడ సాగించగలవు. సక్రమంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక ముందుగా ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎటువంటి కార్యాచరణతో ముందుకు సాగాలనేదానిపై కూడా ఈ సమావేశంలో చర్చించాము,” అని అచ్చెన్నాయుడు తెలిపారు.
రాహుల్ గాంధీ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా తొందరపాటుతో వ్యవహరించిందని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. దిగువకోర్టులో శిక్ష పడితే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోరాడి న్యాయం పొందే అవకాశం ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం హడావుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటువేసి విమర్శలు మూటగట్టుకొంటోందని అచ్చెన్నాయుడు అన్నారు.



