తెలంగాణ ప్రజల దృష్టిలో రాష్ట్ర విభజనను చివరివరకు అడ్డుకొన్న ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి. ఆంధ్రా ప్రజల దృష్టిలో సమైక్య రాష్ట్రం కోసం చివరివరకు పొరాడి ఓడిన వీరుడు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఆయన చేసింది మాత్రం ప్రజలు అనుకొంటున్నదానికి పూర్తి భిన్నం. నిజానికి ఆయన ముఖ్యమంత్రి హోదాలో చివరి నిమిషం వరకు కేంద్రానికి సహకరిస్తూనే ఉన్నారు. ఆయన సహకరించకపోతే తెలంగాణ ఏర్పాటు మరికొన్నేళ్ళు ఆలస్యమై ఉండేది కనుక ఆయన తెలంగాణ ప్రజలకు మహోపకారం చేశారని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏవిదంగా ఉత్తుత్తి పోరాటాలు చేశారో, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదేవిదంగా చేశారని చెప్పక తప్పదు. బహుశః అందుకే 2014 ఎన్నికలలో ఆంధ్రా ప్రజలు ఆయనను తిరస్కరించారని చెప్పవచ్చు.
దాదాపు 9 ఏళ్ళ రాజకీయ సన్యాసం విరామం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి కండువా కప్పుకొని ఏపీలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడేందుకు వస్తున్నారు. బుదవారం ఆయన విజయవాడలో బిజెపి కార్యాలయానికి వస్తున్నారు. రాష్ట్ర బిజెపి నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. అది వేరే విషయం.
అయితే ఈ నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నా రాష్ట్రాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం, బిజెపి అధిష్టానం ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. కానీ ఏపీలో బిజెపిని ఏవిదంగా బలోపేతం చేసుకోవాలా అని లోతుగా ఆలోచించి చివరికి కిరణ్ కుమార్ రెడ్డిని తెచ్చుకొంది. అంటే బిజెపికి తన రాజకీయ ప్రయోజనాలే తప్ప ఏపీ పరిస్థితి పట్టదనుకోవాలా?
ఇంతకాలం ఏపీలో బిజెపి నిద్రాణవస్థలో ఉండిపోయింది. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్దపడ్డారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్‌కి ఢిల్లీకి పిలిపించుకొని కలిసి పనిచేస్తామని చెప్పించారు. కానీ ఇప్పుడు అపార రాజకీయ అనుభజ్ఞుడు, ఏపీ రాజకీయాలను, కుల సమీకరణాలను కాచి వడబోసిన కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు కనుక బహుశః బిజెపికి ఇక పవన్ కళ్యాణ్ అవసరం ఉండక పోవచ్చు. రాష్ట్ర బిజెపి నేతలు ఎవరికీ కూడా పవన్ కళ్యాణ్‌తో పొత్తు పొడవలేదు. పైగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాపు ఓటు బ్యాంకుని గంపగుత్తగా తెచ్చి బిజెపి బుట్టలో పోస్తారనే నమ్మకం లేదు. కనుక కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆయన అవసరం ఉండకపోవచ్చు. బహుశః త్వరలోనే దీనిపై స్పష్టత రావచ్చు. ఒకవేళ బిజెపి పవన్ కళ్యాణ్‌ని కరివేపాకులా తీసి పక్కన పడేస్తే, ఆయన ఏవిదంగా రియాక్ట్ అవుతారో ఊహించుకోవచ్చు. కేంద్రానికి, బిజెపి అధిష్టానానికి ఏపీలో రాజకీయంగా బలపడటమే ముఖ్యమని మరోసారి చాటుకొన్నట్లవుతుంది కూడా!



