బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘టిఎస్’ ని ‘టిజీ’ చేశారని, తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చేశారని, ఆమె చేతిలో బతుకమ్మని తీసి పడేశారంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి పనులన్నీ పిచ్చి తుగ్లక్ పనులే అంటూ విమర్శించారు.
నాడు తుగ్లక్ అనే రాజు దేశ రాజధాని ఢిల్లీ నుంచి మార్చడం వంటి అనేక పిచ్చి పనులు చేశాడని, ఆవిధంగా ‘పిచ్చి తుగ్లక్ పాలన’ మొదలైందని కేటీఆర్ అన్నారు.
అయితే సిఎం రేవంత్ రెడ్డి పాలనని పిచ్చి తుగ్లక్ పాలనగా అభివర్ణించేటప్పుడు కేటీఆర్ కొన్ని పాత విషయాలు మరిచినట్లున్నారు.
తన తండ్రి కేసీఆర్ ‘తెలుగు తల్లి’ని కాదని వేరేగా ‘తెలంగాణ తల్లి’ ఏర్పాటు చేసుకున్న సంగతి కేటీఆర్ మరిచినట్లున్నారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన సంగతి కేటీఆర్ మరిచినట్లున్నారు.
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన పేరుతో మూడు నెలలు స్థిరాస్తుల క్రయవిక్రయాలు, వాటి రిజిస్ట్రేషన్లు అన్నిటినీ నిలిపివేసి లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన సంగతి కేటీఆర్ మరిచినట్లున్నారు
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా తెలంగాణలో నీళ్ళు పారించావచ్చని కాంగ్రెస్ నేతలు నెత్తినోరు మొత్తుకొని చెపుతున్నా వినకుండా సుమారు రూ.70-80 వేల కోట్లతో మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే అది ఆయన పదవిలో ఉండగానే క్రుంగిపోయి నిరుపయోగంగా మారిన సంగతి కేటీఆర్ మరిచినట్లున్నారు.
కేటీఆర్ రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలన అని ఎద్దేవా చేస్తున్నప్పుడు తన తండ్రి పాలనని కూడా ఎద్దేవా చేసుకొంతున్నట్లే అనిపిస్తుంది. తుగ్లక్ పాలన అక్కడితో ఆగిపోలేదు.
ఈ పిచ్చి తుగ్లక్ పాలనని ఏపీకి కూడా విస్తరించేందుకు కేసీఆర్ చేసిన కృషి గురించి కేటీఆర్ కంటే ఎవరికీ బాగా తెలుసు?
ఏపీ రాజధానిగా అమరావతిని కాదని మూడు రాజధానులు, విశాఖ రాజధాని అంటూ 5 ఏళ్ళు కాలక్షేపం చేసిన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి కూడా ‘తుగ్లక్ పాలన’ చేశాడని కేటీఆర్ చెప్తున్నట్లే ఉంది.
కానీ జగన్ మూడు రాజధానులంటునప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఎన్నడూ ‘తుగ్లక్ పాలన’ అని తప్పు పట్టలేదు. ఎందుకంటే ఆ తుగ్లక్ పాలన వల్లనే ఏపీకి రావల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు అన్నీ తెలంగాణకు తరలివస్తుండేవి కనుక. కానీ ఏపీలో తుగ్లక్ చాలా మంచోడు… మా అన్నయ్య అని మెచ్చుకుంటూ తెలంగాణలో తుగ్లక్ మంచోడు కాదంటే ఎలా?






