హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై వివిద పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. వారిలో బిఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావులు కూడా ఉన్నారు.
హర్యానాలో కాంగ్రెస్, జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ ఓడిపోయాయి. కనుక దేశ ప్రజలు ఆ రెండు జాతీయ పార్టీలను విశ్వసించడం లేదని స్పష్టమైందని హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించి కాంగ్రెస్ పార్టీని ఓడించారని కనుక ఇప్పటికైనా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తన ప్రతీకార రాజకీయాలు మానుకొని ఆరు గ్యారెంటీ (హామీలు) తక్షణం అమలుచేయాలని హరీష్ రావు హితవు పలికారు.
కేటీఆర్ స్పందిస్తూ, “ఈ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలకు జాతీయ పార్టీలపై రాన్రాను నమ్మకం సన్నగిల్లుతొందని సూచిస్తున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి,” అని అన్నారు.
హరీష్ రావు, కేటీఆర్ ఈ ఎన్నికల ఫలితాలను తమ పార్టీ కోణంలో నుంచే విశ్లేషించారని అర్దమవుతూనే ఉంది.
హర్యానాలో బీజేపీ గెలిచింది. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి.
అంటే ఓ రాష్ట్రంలో బీజేపీ, మరో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నాయన్న మాట! కానీ హరీష్ రావు, కేటీఆర్ వాటి ఈ విజయాల గురించి ప్రస్తావిచకుండా వాటి ఓటమి గురించి మాత్రమే మాట్లాడి వక్రభాష్యాలు చెపుతున్నారు.
తెలంగాణ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే దానిని వారు బాగానే సమర్ధించుకున్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీల ఈ విజయాలను చూడకుండా ఓటమిని మాత్రం భూతద్దంలో నుంచి అందరికీ చూపిస్తూ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా ఇదేవిదంగా చాలా అహంభావంతో మాట్లాడేవారు. కాంగ్రెస్, బీజేపీ రెంటికీ పూర్తి మెజార్టీ రాదని, తమ వంటి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. బీజేపీ 370-400 ఎంపీ సీట్ల అంచనాలు ఫలించనప్పటికీ మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి అధికారంలోకి వచ్చింది.
తాజా ఎన్నికలలో రెండు జాతీయ పార్టీలు చెరో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగే లేదనుకుంటే అక్కడే దానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సొంత రాష్ట్రంలో తమ వైఫల్యాలను, రాజకీయ అసమర్దతని, ప్రజల నమ్మకాన్ని, ఆదరణని కోల్పోవడాన్ని కప్పిపుచ్చుకుంటూ కాంగ్రెస్, బీజేపీల పని అపోయిందంటూ కేటీఆర్, హరీష్ రావులు చెప్పడం చూస్తే వారు ఓటమి నుంచి ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదని స్పష్టం అవుతోంది. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోనివారు రాజకీయాలలో ఎక్కువ కాలం రాణించలేరు.




