మీడియాకి కేటీఆర్‌ లాస్ట్ వార్నింగ్

KTR

బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేయబోతున్నారని కాదు కాదు… బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను బీజేపీకి అప్పగించబోతున్నారని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి నాలుగు నెలలు పైనే అయ్యింది. కానీ ఇంతవరకు ఆమెకు బెయిల్‌ లభించ లేదు. కనుక ఆమెను విడిపించుకునేందుకు బీజేపీ పెద్దలతో ఈవిదంగా రాజీపడేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, అందుకే కేటీఆర్‌, హరీష్ రావులు ఢిల్లీకి వెళ్ళివస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

బిఆర్ఎస్, బీజేపీల మద్య చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలోనే కుండబద్దలు కొట్టారు. లేకుంటే కేటీఆర్‌, హరీష్ రావులు ఢిల్లీ పర్యటనలు దేనికని ప్రశ్నిస్తున్నారు.

కనుక నిప్పు లేనిదే పొగరాదన్నట్లు సిఎం రేవంత్‌ రెడ్డి చెపుతున్నట్లు ఢిల్లీలో ఏదో జరుగుతోందనే అందరూ అనుమానిస్తున్నారు.

అయితే ఇంతకాలం ఈ ఊహాగానాలపై స్పందించని బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, తొలిసారిగా ఘాటుగా స్పందిస్తూ, తమ పార్టీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారందరికీ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.

“గత 24 ఏళ్ళలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలను, మా పార్టీ గురించి తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటూనే పొరాడి తెలంగాణ సాధించుకున్నాము. అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపాము. కానీ నేటికీ కొందరు దురుదేశ్యంతో మాపై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు.

అటువంటి వారందరికీ ఇదే ఫైనల్ వార్నింగ్. బేషరతుగా క్షమాపణలు తెలియజేయాలని సూచిస్తున్నాను. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను.

బిఆర్ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తుంది. ఈ ప్రయత్నంలో మేము పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం! కాని తల వంచం. ఎప్పటికైనా, ఎన్నటికైనా! జై తెలంగాణా!” అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

అసలు ఈ పుకార్లు మొదలైనప్పుడే కేటీఆర్‌ వాటిని ఖండించి ఉండి ఉంటే ఇంత దూరం వచ్చేవి కావు కదా? నేటికీ కేటీఆర్‌ తన సందేశంలో ‘ఈ పుకార్లను, ఊహాగానాలను ఖండిస్తున్నామని’ నిర్ధిష్టంగా చెప్పలేదు. కనుక మీడియాని నిందించడం, బెదిరించడం దేనికి?

ADVERTISEMENT
Latest Stories