ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ‘సౌత్ గ్రూప్’లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రధానపాత్ర పోషించారని సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వంద కోట్లు చేతులు మారిన్నట్లు గుర్తించిన ఈడీ కూడా రంగంలో దిగి, మనీ లాండరింగ్ నేరానికి ఎంపీ మాగుంట కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఫిభ్రవరి 11వ తేదీన అరెస్ట్ చేసింది.
మాజీ మంత్రి, వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఈరోజు ఒంగోలు పట్టణంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసానికి వెళ్ళి కలిసిన తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.
ఎంపీ మాగుంట మాట్లాడుతూ, “నాకు, నా కుమారుడికి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎటువంటి సంబందమూ లేదు. మా కుటుంబం 70 ఏళ్ళుగా ఎంతో నీతినిజాయితీలతో 10 రాష్ట్రాలలో వ్యాపారాలు చేస్తోంది. ఏనాడూ అవినీతి, అక్రమాలకి పాల్పడలేదు. మా కుటుంబం ఎటువంటిదో ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ కేసుతో మా కుటుంబాన్ని ముడిపెట్టి నా కుమారుడిని అరెస్ట్ చేయడం చాలా బాధపడుతున్నాను,” అని అన్నారు.
ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ, “మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా ప్రజలకు చిరకాలంగా సేవ చేస్తోంది. వారు ఎవరికీ అపకారం తలపెట్టేవారు కారు. అటువంటి మాగుంట కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ కేసులో ఇరికించారని భావిస్తున్నాను. రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదని భావిస్తున్నాను. అయితే ఈ కేసు నుంచి రాఘవరెడ్డి తప్పకుండా స్వచ్ఛంగా బయటపడతారని నమ్ముతున్నాను. జిల్లా ప్రజలు, వైసీపీ కూడా మాగుంట కుటుంబానికి అండగా నిలబడుతుంది,” అని అన్నారు.
వివేకా హత్య కేసులో కూడా వైసీపీ నేతలు ఇదేవిదంగా వాదిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. కానీ రెండు కేసులలో సీబీఐ పక్కా సాక్ష్యాధారాలతోనే నిందితులని అరెస్ట్ చేస్తోంది. ఒకవేళ రాజకీయ కారణాలు లేదా ఒత్తిళ్ళకి తలొగ్గి సీబీఐ అక్రమంగా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నట్లయితే, వారందరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడగల ధనవంతులు, పలుకుబడిగలవారే. కనుక సీబీఐ తప్పు చేస్తే అక్కడ సుప్రీంకోర్టులో దొరికిపోయి తలదించుకోవలసి వస్తుంది. సీబీఐ, ఈడీ అధికారులు ఈ రెండు కేసులలో పూర్తి సాక్ష్యాధారాలతోనే ముందుకు సాగుతున్నారని భావించవచ్చు. కనుక ఈ రెండు కేసులలో తామందరం స్వాతిముత్యాలమని వైసీపీ నేతలే నిరూపించుకోవలసి ఉంటుంది తప్ప సీబీఐ లేదా ఈడీలు కావు.



