దేశంలోనే గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రంగా ఖ్యాతి గడించిన తెలంగాణా ప్రభుత్వానికి మాయని మచ్చ లాంటి సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన చాలా అంశాలపై హైకోర్టు అక్షింతలు వేస్తూ… పాలనలోని లోపాలను ఎత్తి చూపుతుండగా, తాజాగా ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లలేదనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు గానూ, ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లలేదని మీడియాలో వచ్చిన కథనాలు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేవేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
“కొత్త జిల్లాలు ఏర్పడిన వేళ, చెక్కులను చెల్లించకుండా తాత్కాలికంగా నిలిపివేశామే తప్ప, అవి చెల్లలేదనడం భావ్యం కాదని” టీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అయితే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణాపై ఈ ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాలకు ఓ ఆయుధం లభించినట్లయ్యింది. ‘తెలంగాణ డబ్బున్న రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్, చెక్కులు బౌన్స్ కావడంపై ఏమంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మల్లన్న సాగర్ ప్రాంతం నేత బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. ఓ వైపు వివిధ పథకాలకు నిధులను ఆపవద్దని కేసీఆర్ చెబుతున్న వేళ, చెక్కు బౌన్సుల వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం.



