మాజీ మంత్రి, ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పార్టీ మారబోతున్నారా?అంటే గుంటూరు జిల్లా కాకుమానులో ఆమె మాట్లాడిన మాటలు వింటే అవుననే అనిపిస్తుంది. అక్కడ ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “ప్రస్తుతం మా కుటుంబం వైసీపీలోనే ఉంది. ఎప్పటికీ ఉండాలనే అనుకొంటున్నాము. ఒకవేళ మావారు దయాసాగర్ పార్టీ మారాలనుకొంటే భార్యగా నేను ఆయనని అనుసరించాల్సిందే కదా?ఒకే కుటుంబ సభ్యులందరి రాజకీయ అభిప్రాయాలూ ఒకేలా ఉండాలని రూల్ ఏమీ లేదు కదా?ఎవరి అభిప్రాయాలూ వారివి. అలాగని భర్త ఓ పార్టీలో, భార్య మరో పార్టీలో, పిల్లలు ఇంకో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు కదా?మా రాజకీయ అభిప్రాయాలూ వేరైనప్పటికీ మేమందరం ఒకే కుటుంబం. కనుక ఒకటిగానే ఉంటాము. కనుక నేను రాజకీయ నాయకురాలినైనప్పటికీ భార్యగా నా భర్తతో కలిసే పయనిస్తాను. ఒకవేళ ఆయన మనం పార్టీ మారుదాం రమ్మనమని అంటే కాదనలేను కదా?” అని అన్నారు.
ఆమె భర్త దయానంద సాగర్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ముంబైలో ఆదాయపన్ను శాఖలో కమీషనర్‌గా పనిచేస్తున్నారు. కనుక ఆయన రాజకీయాలలోకి వచ్చే ఆవకాశం లేదు. కానీ భర్త పేరు చెప్పి పార్టీ మారడం గురించి మాట్లాడటమే ఆసక్తికరం.
ఆమె 2019 ఎన్నికలలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్ధి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ని, జనసేన అభ్యర్ధి రావెల కిషోర్ బాబుని ఓడించారు. ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకులను ఓడించినందుకు బహుమతిగా జగన్మోహన్ రెడ్డి ఆమెకి కీలకమైన రాష్ట్ర హోంమంత్రి పదవిని ఇచ్చారు. కానీ ఆమె పనితీరుతో సంతృప్తి చెందకపోవడంతో రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆమెని పదవిలో నుంచి తొలగించి తానేటి వనితని నియమించారు.
మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా ఒకప్పుడు టిడిపిలో ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరి పక్కలో బల్లెంలా మారడంతో ఆమె పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో పార్టీ మారేందుకు వెనుకాడనని సంకేతాలు పంపారు. కానీ ఆ తర్వాత చల్లబడ్డారు. తనకి వచ్చే ఎన్నికలలో ప్రత్తిపాడు టికెట్ లభించకపోవచ్చని సుచరిత అనుమానంగా ఉన్నారు. అందుకే పార్టీలోనే ఉండాలనుకొంటున్నానని కానీ టికెట్ ఇవ్వకపోతే జంప్ చేయడానికి వెనుకాడనని సూచిస్తున్నట్లు భావించవచ్చు.
—



