ప్రతి శుక్రవారం కొత్త సినిమా ఏదో ఒకటి చూడనిదే ఏదో కోల్పోయినట్టు ఫీలయ్యే ప్రేక్షకులు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉన్నారు. ఈ కారణంగానే ఎంత చిన్న హీరోదైనా సరే ఉదయం ఆటకు అంతో ఇంతో జనాన్ని థియేటర్లలో చూస్తుంటాం. రాను రాను ఈ మనస్తత్వం కూడా మారిపోతోంది. హాలు దాకా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని, వందా రెండు వందలు టికెట్ కు ఖర్చు పెట్టుకుని, మూడు గంటల విలువైన సమయాన్ని త్యాగానికి సిద్దపడి ఇంతా చేస్తే దానికి కనీస న్యాయం చేయలేనప్పుడు ఆసక్తి చావకుండా ఏం జరుగుతుంది.
ఇవాళ ప్రధానంగా రెండు కొత్త రిలీజులు వచ్చాయి. ఒకటి మిస్టర్ కింగ్. శరణ్ కుమార్ అని కొత్త హీరో. ఇతను హీరోయిన్లు తప్ప మిగిలినవాళ్లంతా బాగా తెలిసిన సీనియర్ మోస్ట్ క్యాస్టింగే. మణిశర్మ లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. దర్శకుడు కొత్తా పాతా అనేది పక్కన పెడితే నాగార్జున టైటిల్ కు ముందు మిస్టర్ తగిలించుకుని మరీ వచ్చారు కదా ఎంతో కొంత విషయం ఉంటుందని ఆశిస్తే మాత్రం నీటి బుడగ మీద సూదితో గుచ్చినట్టే ఉంటుంది. సహనానికి పరీక్ష పెట్టే సన్నివేశాలతో సందేశాలతో ఆడియన్స్ కి సిఏ రేంజ్ లో పరీక్ష పెట్టేశారు.
కోనసీమ థగ్స్ అనే డబ్బింగ్ మూవీ మరొకటి. బాబీ సింహా తప్ప మనం ఠక్కున గుర్తుపట్టే ఆర్టిస్టులు లేని ఆరవ చిత్రం. కొరియోగ్రాఫర్ గా ఎంతో అనుభవమున్న బృంద మాస్టర్ ఈ సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఎంచుకున్న కథ మంచిదే కానీ మరీ ఇంటర్వెల్ వచ్చేదాకా ఏ సన్నివేశం అసలెందుకు వస్తుందో ఎందుకు పోతుందో అర్థం కాక జుత్తు పీక్కోవాల్సిందే. సెకండ్ హాఫ్ లో అంతో ఇంతో మంచి సీన్లు పడ్డాయి కానీ బయటకి వచ్చేటప్పుడు బాగుందని చెప్పడానికి ఈ కంటెంట్ ఏ మాత్రం సరిపోక నీరసం తెప్పించేస్తుంది.
మిగిలిన విడుదలల గురించి చెప్పుకోవడం అప్రస్తుతం. చాలా చోట్ల వీటికి కనీసం కరెంట్ ఖర్చులు వచ్చేంత ఆడియన్స్ కూడా లేక షోలు రద్దు చేసే దాకా వచ్చింది పరిస్థితి. ఇన్నేసి కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ అగ్రిమెంట్లు, షేర్లు, కండీషన్లు, అడ్వాన్సులు, పబ్లిసిటీ మెటీరియల్ ఇలా బోలెడు తతంగాలు పూర్తి చేసుకుని సినిమాలు రిలీజ్ చేస్తుంటే వాటికి కనీస ఆదరణ లేకపోతే ఆ తప్పు ఎవరిది. ఫిబ్రవరి మీద నింద వేయడానికి లేదు. గత ఏడాది బ్లాక్ బస్టర్ కొట్టిన డీజే టిల్లు వచ్చింది సరిగ్గా ఈ టైంలోనే. వేగంగా షూటింగులు చేయడం కాదు స్క్రిప్ట్ ల మీద శ్రద్ధ పెట్టడం అవసరమని దీన్ని బట్టి అర్థమవ్వట్లా.



