క్రికెట్ ప్రపంచంలో ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ బ్యాటింగ్ విభాగంలో ఉన్న రికార్డులలో ఎక్కువ శాతాన్ని తన ఖాతాలోనే వేసుకున్న ఈ లెజెండరీ క్రికెటర్ రికార్డులు ఒక్కొక్కటిగా బద్ధలవుతుండడం విశేషం. తాజాగా కివీస్ తో జరిగిన మూడవ వన్డేలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక రికార్డును బద్దలు కొట్టగా, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో సచిన్ రికార్డును సమం చేసాడు.
ఇండియా తరపున వన్డేలలో అత్యధిక సిక్సర్లు సాధించిన క్రికెటర్ గా 195 సిక్సర్లతో సచిన్ అగ్ర స్థానంలో నిలువగా, కెప్టెన్ ధోని మూడవ వన్డేలో బాదిన మూడు సిక్సర్లతో దానిని అధిగమించి, 196కు చేరాడు. అలాగే కెప్టెన్ హోదాలో 125 సిక్సర్లను బాదాడు ధోని. ఈ రికార్డు అలా ఉంటే, ఇండియన్ చేజింగ్ వీరుడు విరాట్ కోహ్లి, మరో సచిన్ రికార్డును సమం చేసాడు. ఇండియా తరపున లక్ష్య చేధనలో సచిన్ 17 సెంచరీలు నమోదు చేయగా, అందులో 14 సెంచరీలు భారత్ కు విజయాన్ని తెచ్చిపెట్టాయి.
తాజాగా విరాట్ కోహ్లి అందుకున్న అజేయమైన 154 పరుగులతో, సచిన్ 14 సెంచరీల విజయాన్ని సమం చేసాడు. లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి మొత్తం 16 సెంచరీలు నమోదు చేయగా, 14 సెంచరీలు విజయం సాధించడంలో దోహదపడ్డాయి. అతి తక్కువ వయసులోనే విరాట్ ఈ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. మొత్తంగా లక్ష్యాన్ని చేధించే క్రమంలో 58 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లి, 16 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు నమోదు చేసాడు. ఓవరాల్ గా విరాట్ కోహ్లికి ఇది 26వ సెంచరీ.



