ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. “నల్లమల సాగర్ ప్రాజెక్టు వలన తెలంగాణకు ఎటువంటి నష్టమూ ఉండదు. కనుక నాడు మేము కాళేశ్వరం ప్రాజెక్టుకి సహకరించినట్లే ఇప్పుడు మీరు నల్లమలసాగర్ ప్రాజెక్టుకి సహకరించాలని,” విజ్ఞప్తి చేశారు.
ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులు చేపడితే దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్ళు తగ్గి నష్టం కలుగుతుంది. కానీ గోదావరిలో రెండు రాష్ట్రాల అవసరాలకు మించే నీళ్ళుపారుతున్నాయి. కనుక తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ప్రాజెక్టులు కట్టుకొని నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెపుతున్నారు.
కానీ తెలంగాణకు దిగువనున్న ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటుంటే, తెలంగాణ రాష్ట్ర రక్షణ బాధ్యత తమదే అన్నట్లు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెపుతూనే ఉంటుంది. అయితే దిగువన ఉన్న ఏపీలో నీళ్ళు వాడుకుంటే ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఏవిధంగా నష్టం కలుగుతుందో చెప్పదు. ఎందుకంటే దాని పోరాటాలు నీళ్ళ కోసమో, తెలంగాణ ప్రయోజనాల కోసమో కాదు కనుక. ఆ పేరుతో తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ, ప్రజలను బీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షించేందుకు… ఎన్నికలలో లబ్ది పొందేందుకు…. ఈ నీళ్ళ రాజకీయాలతో అధికార కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెడుతూ రాజకీయంగా పైచేయి సాధించేందుకే.
బీఆర్ఎస్ పార్టీ ఈ ఫార్ములాతో దూసుకుపోతూ రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు దోషిగా తల దించుకొని నిలబడాలనుకోదు కదా? అందుకే అది కూడా ఈ నీళ్ళ రాజకీయ రేసులో పాల్గొంటుంది. బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ రాజకీయాలను నమ్ముకుంటే, బిజేపి మత రాజకీయాలను నమ్ముకుంది. కనుక ఈ రేసులో పాల్గొనదు. అంటే నీళ్ళ పేరుతో జరుగుతున్న రాద్దాంతం అంతా కాంగ్రెస్-బిజేపిల మద్య సాగుతున్న ఆధిపత్యపోరులో పైచేయి సాధించడానికే తప్ప నీళ్ళ కోసమో రైతుల కోసమో కాదని స్పష్టమవుతోంది.
కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల గొడవ నీళ్ళ కోసమే అయితే ఏదో విధంగా పరిష్కరించుకోవచ్చు. కానీ నీళ్ళ కోసం కాదు. వాటి నీళ్ళ రాజకీయాలు దేనికో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కంటే బాగా ఎవరికి తెలుస్తుంది? కానీ తెలియనట్లు శాస్త్ర ప్రకారం అవరోధాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు…. అనుకోవాల్సి ఉంటుంది.




