అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం సినిమా ప్రమోషన్లు హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యేవి. మహా అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పట్టణాలు లేదా నగరాల్లో ఏదో ఒక ఈవెంట్ చేసి నెట్టుకొచ్చేవాళ్ళు. టాలీవుడ్ స్టార్లు ప్యాన్ ఇండియా మోజులో పడ్డాక కాళ్ళు అరిగేలా కళ్ళు తిరిగేలా దేశం మొత్తం తిరగాల్సి వస్తోంది. కొన్నిసార్లు దేశాలు దాటాల్సిందే. ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు మొన్నటిదాకా రాజమౌళితో కలిసి తిరుగుతూనే ఉన్నారు. ఆస్కార్ వాళ్ళకు రాకపోయినా మద్దతు కోసం వెన్నంటే తోడు నిలిచారు.
నాని దసరా కోసం ఇండియాలో ఉన్న సిటీలన్నీ చుట్టేస్తున్నాడు. కాలేజీలు, ఈవెంట్లు, రోడ్ సైడ్ తిండి అమ్మేవాళ్ళతో ముచ్చట్లు ఒకటా రెండా తన కెరీర్ బెస్ట్ మాస్ మూవీ కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. ఆఖరికి రోడ్డు మీద ఆటో నడిపాడు. కీర్తి సురేష్ తో దించకుండా బాటిల్ ఎలా ఖాళీ చేయించాలో వీడియో చేయించాడు. యశోదకి సమంతా ఇంతకన్నా ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. లైగర్ కి గత ఏడాది పూరి, విజయ్ దేవరకొండ, ఛార్మీలు లెక్కలేనన్ని టూర్లు తిరిగొచ్చారు. బ్రహ్మాస్త్ర టీమ్ చేసింది కూడా ఇదే పనే.
సినిమా ప్రొడక్షన్ కన్నా ఈ తిరుగుళ్ల కోసమే నిర్మాత ఖర్చులు యాక్టర్ల కష్టాలు పెరిగిపోతున్నాయి. భారీ ఓపెనింగ్స్ దక్కించుకోవడానికి ఇంత కన్నా మార్గం లేదు. నార్త్ ఆడియన్స్ క్రమంగా మనల్ని బాగా గుర్తు పడుతున్నారు. ప్రభాస్ ఒక్కడే కాదు మేమూ ఉన్నామంటూ మన హీరోలు వీలైనంత ముంబై మీడియా ఎక్స్ పోజర్ ని కోరుకుంటున్నారు. ఉపేంద్ర ముంబై వెళ్లినా అమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చి చిరంజీవి నాగార్జున రెక్కలు పట్టుకుని ప్రీమియర్లు చూపించి ప్రెస్ మీట్లు పెట్టి పొగిడించుకున్నా అందరి ఉద్దేశం ఒకటే.
క్రమంగా ఇది వరల్డ్ వైడ్ గా మారినా ఆశ్చర్యం లేదు. అంటే ఓవర్సీస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కోసం ఏ న్యూజెర్సీలోనూ దుబాయ్ నగరంలోనో వేడుకలు చేయాల్సిన అవసరం పడొచ్చు. మిలియన్ డాలర్ల కలెక్షన్లు రావాలంటే అక్కడి అభిమానులతో ఫ్యాన్ మీట్స్ పెట్టాల్సి రావొచ్చు. చరణ్ తారక్ లు చేసేశారు కానీ అది ఆస్కార్ క్యాంపైన్ కాబట్టి ఈ క్యాటగిరీలోకి రాదు. ఇలా అయితే రాబోయే రోజుల్లో ప్రొడ్యూసర్ల బడ్జెట్ మరింత భారమవుతుంది. ఓ అయిదారు కోట్లు వీటికే కేటాయించే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం పోనక్కర్లేదు.



