మూడేళ్ళుగా ఏం పీకుతున్నారు?

Nara_Lokesh_TDPతెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “దావోస్ పర్యటన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలా సాగుతోంది. అక్కడ ముఖ్యమంత్రి గుజరాత్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని తప్ప మరెవరినీ ఇంతవరకు కలియలేదు. ఆయన కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానని ఎటువంటి హామీ ఇవ్వలేదు. సుమారు 8 కోట్లు ఖర్చు పెట్టుకొని ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్ళవలసిన అవసరం ఏమిటి? గుజరాత్‌ వెళ్ళి కలిస్తే సరిపోతుంది కదా?

దావోస్ పర్యటనకు వచ్చే విదేశీ సంస్థల ప్రతినిధులు, మీ రాష్ట్ర రాజధాని ఎక్కడుంది? దాని పేరేమిటి? అని అడిగితే ముఖ్యమంత్రి ఏమని జవాబు చెప్తారు? అని నారా లోకేష్ ప్రశ్నించారు.

ADVERTISEMENT

ఏపీ సాగునీటి శాఖ మంత్రి అంబటి రాంబాబు, ‘పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని’ చెప్పడంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది కదా..మరిన్ని రోజులుగా మీరు ఏం పీకుతున్నారు? అసలు ఆ ప్రాజెక్ట్ గురించి, దానికి సంబంధించిన సాంకేతిక అంశాల గురించి బొత్తిగా అవగాహన లేని అంబటి రాంబాబుకి మంత్రి పదవి కట్టబెట్టడం వలననే ఆయన ఈ విధంగా తెలివితక్కువగా మాట్లాడుతున్నారు ,” అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్సార్ ఎమ్మెల్సీ అనంత బాబును పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంపై నారా లోకేష్ స్పందిస్తూ, “నేను విజయవాడకు వస్తే నా చుట్టూ 500 మంది పోలీసులను కాపలా పెడతారు. ఇంతమందిని నా చుట్టూ పెట్టే బదులు, వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని వెతికి పట్టుకోవడానికి ఉపయోగించి ఉంటే అతను తప్పకుండా దొరికి ఉండేవాడు. కానీ ప్రభుత్వం, పోలీసులు అతనిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే అతను దొరకడం లేదని అబద్దాలు చెపుతున్నారు. ఇంతకీ అతనిని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో దాచి ఉంచారా? మరెక్కడైనా దాచిపెట్టారా?” అని నారాలోకేశ్ ప్రశ్నించారు.

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని డబ్బు ఇచ్చి రాజీకి ప్రయత్నించిన మాట వాస్తవం కాదా?ఈ కేసు ఉపసంహరించుకుంటే సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. 2 లక్షలు నగదు, కొంత వ్యవసాయ భూమి ఇస్తానని ప్రలోభ పెట్టినమాట వాస్తవమా కాదా? పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయకుండా బాధిత కుటుంబాన్ని భయపెట్టి ప్రలోభ పెట్టి కేసు ఉపసంహరింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. అదే… నామీద, మా పార్టీ నేతలు, కార్యకర్తల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వైయస్సార్ ప్రభుత్వం 5 క్షణాలు కూడా ఆలస్యం చేయదు. గత మూడేళ్లు గా ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది,” అని నారా లోకేష్ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT
Latest Stories