టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిన్న ఉదయం కొంగారెడ్డిపల్లి క్యాంప్ సైట్ నుంచి 12వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. సమీపంలోని ఓ ప్రైవేట్ స్థలంలో బహిరంగసభ నిర్వహించారు. కానీ సభని అడ్డుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారని నారా లోకేష్ తన యువగళం-జనవాణి డైయిరీలో పేర్కొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సభకి వస్తున్న పార్టీ కార్యకర్తలని పోలీసులు అడ్డుకొని వెనక్కి తిప్పి పంపించేశారని నారా లోకేష్ ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా చేయాలని జగన్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, యువగళం పాదయాత్రకి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తోందని నారా లోకేష్ అన్నారు. ప్రజా స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ పతనం ఖాయమని స్పష్టమవుతోందని నారా లోకేష్ అన్నారు.
నారా లోకేష్ తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వం ఏవిదంగా ప్రజలని పీడిస్తోందో తెలియజెపుతూ, రేపు వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి మీరు పీల్చే గాలికి లెక్కగట్టి పన్ను కట్టమంటారని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రజలకి నీళ్ళు అందించే హంద్రీనీవా ప్రాజెక్టుని పక్కనపడేసారు. 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అమర్ రాజా ఫ్యాక్టరీని రాష్ట్రంలో నుంచి తెలంగాణకి తరిమేసారు. కానీ తాను నేను రాయలసీమ బిడ్డనని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటున్నారు.
“వైసీపీకి 175 సీట్లు ఎందుకు రావని జగన్ రెడ్డి అడుగుతున్నారు. మేము కూడా అడుగుతున్నాము ప్రత్యేకహోదా ఎందుకు రాదని… కడప ఉక్కు కర్మాగారం ఎందుకు రప్పించలేకపోయారని అడుగుతున్నాము. పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేకపోయారని అడుగుతున్నాము. జాబ్ క్యాలండర్… మెగా డీఎస్సీ ఎందుకు ప్రకటించలేదని అడుగుతున్నాము. ఓసారి తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకి వచ్చి పరదాలు కట్టుకోకుండా ప్రజలని చూస్తే వారి బాధలు, కష్టాలు అన్ని అర్దమవుతాయి మీకు,” అంటూ సిఎం జగన్మోహన్ రెడ్డిని నారా లోకేష్ గట్టిగా నిలదీశారు.
నారా లోకేష్ మంగళవారం చిత్తూరు నియోజకవర్గంలో నేడు 13వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకి దిగువమాసానపల్లెలో బీసీ వర్గానికి చెందిన ప్రజలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకి ఆయనవేడు చేరుకొని అక్కడ గ్రామస్తులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకొన్నారు. మరికొద్ది సేపటిలో అంటే ఉదయం 11 గంటలకి అరతల గ్రామంలోని యువతతో నారా లోకేష్ భేటీ అయ్యి నిరుద్యోగ సమస్య గురించి అడిగి తెలుసుకొంటారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అక్కడే మహిళలు, రైతులతో వేర్వేరుగా సమావేశమయ్యి వారి సమస్యలని అడిగి తెలుసుకొంటారు. మళ్ళీ భోజన విరామం తర్వాత పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం 4 గంటలకి బాకర ఎన్‌ఆర్ పేటలో బహిరంగసభలో పాల్గొంటారు.



