టిడిపి యువనేత నారా లోకేష్ మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో 53వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు దారిలో కియా కంపెనీకి అనుబంద సంస్థలైన సిఎస్‌సి, ఎస్‌ఎల్ ఏపీ కంపెనీలకు ఉద్యోగులను తీసుకువెళుతున్న బస్సులను చూపిస్తూ సెల్ఫీలు తీసుకొన్నారు. తర్వాత ఆ కంపెనీల వద్ద ఆగి సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో అనంతపూర్ జిల్లాకు కియా కంపెనీని రప్పించి వందలాదిమంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. ఇవిగో వాటి అనుబంద కంపెనీలు…. వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు. ఈ కంపెనీలను రప్పించి యువతకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా స్థానికంగా వేలాదిమంది ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. సిఎం జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాటి గురించి ఎన్నడైనా మాట్లాడగలరా?అంటూ ట్వీట్ చేశారు.
దారిలో ‘వూ యంగ్’ అనే కంపెనీ బస్సులో వెళుతున్న ఉద్యోగులను చూపిస్తూ సెల్ఫీ తీసుకొంటుండగా, బస్సులోని ఉద్యోగులు నారా లోకేష్‌ని చూసి బస్సుని ఆపించి ఆయనకు షేక్ హ్యాండ్స్ ఇచ్చి సంతోషం వ్యక్తం చేశారు. “ఓ విజయం సాధిస్తే వచ్చే కిక్కు మహా గొప్పగా ఉంటుంది. నిదర్శనం ఇదిగో…” అంటూ ఆ ఫోటోను కూడా నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బుదవారం 54వ రోజున పెనుగొండ నియోజకవర్గంలో నల్లగొంద్రాయణపల్లి నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఫోటోలు దిగారు. ఇవాళ్ళ తెలుగుదేశం పార్టీ 41వ వార్షికోత్సవం కావడంతో దారిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నారా లోకేష్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి తెలుగు ప్రజలకు మహోపకారం చేశారని కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. అనంతరం మళ్ళీ సోమందేలపల్లి, పెనుకొండ మీదుగా యువగళం పాదయాత్రను కొనసాగిస్తూ దారిలో బ్రాహ్మణులు, ఎస్సీలు, బోయ, కురుమలు, మహిళలు, చేనేత కార్మికులతో భేటీ అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. దారి పొడవునా ఆయనకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ముఖ్యంగా యువత నారా లోకేష్ వెంటనడుస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు.



