టిడిపి యువనేత నారా లోకేష్ ఈరోజు శ్రీ సత్యసాయిజిల్లా, పెనుకొండ నియోజకవర్గంలో 52వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నారు. దారిలో జీనబండ్లపల్లి గ్రామం వద్ద ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “గత ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి 151 స్థానాలు ఇచ్చారు. అంతా మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కానీ అధికారం చేపట్టగానే ఉండవల్లిలో ప్రజావేదికను కూల్చివేయించేశారు. పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఉపాది కల్పించాలి. కానీ ఇదివరకు మేము తెచ్చిన రిలయన్స్ కంపెనీని మూయించేశారు… అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని తెలంగాణకు పంపించేశారు. మేము చేసుకొన్న ఒప్పందాలను రద్దు చేసి పడేశారు. కొత్త కంపెనీలను తీసుకురాలేకపోయినా నడుస్తున్న కంపెనీలనైనా కాపాడుకొని ఉండాలి కానీ అదీ చేయలేకపోయారు.
151 సీట్లు గెలుచుకొని భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినందుకు ఏం చేయాలి? జాబ్ క్యాలండర్ ప్రకటించాలి. డీఎస్సీ తీయాలి. కానీ తీయకుండా నిరుద్యోగులకు మటన్ దుకాణాలు, చికెన్ దుకాణాలు, చేపల దుకాణాలు పెట్టుకొని వాటితో బ్రతికేయమని చెప్పారు. 151 సీట్లు గెలుచుకొన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనుకొంటే, అప్పుల్లో, గంజాయి పెంపకం సరఫరాలో రాష్ట్రాన్ని నెంబర్: 1 స్థానంలో నిలిపారు. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయించడంలో రాష్ట్రాన్ని నెంబర్: 1 స్థానంలో నిలిపారు.
151 సీట్లు ఇస్తే ఏమీ చేయని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు 175 సీట్లు కావాలని అడుగుతున్నారు! ఎందుకు ఇవ్వాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విదాలుగా భ్రష్టు పట్టించేసిన ఈ ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు,” అని నారా లోకేష్ అన్నారు.
వచ్చే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకొంటామని గొప్పలు చెప్పుకొంటున్న వైసీపీ అధినేతకు రాష్ట్ర ప్రజలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో అట్లకాడ కాల్చి వాతపెట్టిన్నట్లు పెట్టారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలే కాదు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నమ్మడం లేదని ఎమ్మెల్సీ ఎన్నికలలో రుజువైందని నారా లోకేష్ అన్నారు.
“ఈ సమస్యలన్నీ తీరాలంటే మళ్ళీ టిడిపి అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ గాడినపడుతుంది. మళ్ళీ పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు, ఉపాది లభిస్తాయి. వచ్చే ఎన్నికలలో టిడిపి గెలిచి అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం,” అని నారా లోకేష్ న్నారు.



