అవసరమైతే జూ.ఎన్టీఆర్‌ రాజకీయాలలోకి…. నారా రోహిత్

Nara_Rohith_Nara_Lokesh_Yuva_Galam_Padayatra_TDPటిడిపి యువనేత నారా లోకేష్‌ ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజులు యువగళం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ శనివారం ఉదయం పుట్టపర్తి నియోజకవర్గంలో ఒనుకువారిపల్లి నుంచి 50వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఎప్పటిలాగే ముందుగా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు, విద్యార్థులు, యువతతో సెల్ఫీలు దిగిన తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు గంజికుంట గ్రామంలో రైతులతో సమావేశమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. తర్వాత దారిలో వడ్డేపల్లి వద్ద ఎస్సీ పెద్దలతో మాట్లాడారు.

ప్రముఖ నటుడు నారా రోహిత్ ఈరోజు నారా లోకేష్‌తో కలిసి కొంతదూరం పాదయాత్ర చేసి సంఘీభావం తెలిపారు. దారిలో ప్రజలతో మాట్లాడుతూ, రాజకీయాలలోకి యువత రావాలని కోరుకొంటున్నానని అన్నారు. ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “అవసరమైతే జూ.ఎన్టీఆర్‌ కూడా రాజకీయాలలోకి వస్తారు,” అని చెప్పడంతో టిడిపి కార్యకర్తలు హుషారుగా ఈలలు వేసి తమ ఆనందం తెలియజేశారు.

ADVERTISEMENT

సాయంత్రం 4.30 గంటలకు రెయిన్ బో ఎడ్యుకేషనల్ అకాడమీ వద్ద బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. రాత్రి రామయ్యపేటల బస చేస్తారు.

నారా లోకేష్‌ ఈ 50 రోజులలో కేవలం రెండుసార్లు మాత్రమే బ్రేక్ తీసుకొన్నారు. మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రెండు రోజులు, మళ్ళీ ఉగాది పండుగకు మూడు రోజులు బ్రేక్ తీసుకొన్నారు. ఈ 50 రోజులలో నారా లోకేష్‌ ఇప్పటివరకు 625 కిమీ పాదయాత్ర పూర్తిచేశారు.

ఈ యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్‌ రాయలసీమ జిల్లాలలోని అన్ని వర్గాల ప్రజలతో చక్కగా కనెక్ట్ అవుతున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. నారా లోకేష్‌ తన ప్రసంగాలలో వైసీపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే, టిడిపి హయాంలో ఏవిదంగా అభివృద్ధి జరిగిందో ప్రజలకు చక్కగా వివరిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు దారిలో టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళను స్వయంగా పరిశీలించి, దాదాపు 95% పూర్తయిన ఆ ఇళ్లలో మిగిలిన పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించకుండా పాడుబెడుతూ, కమీషన్ల కోసం మళ్ళీ కొత్తగా ఇళ్ళు, స్థలాలు అంటూ వృధా ఖర్చులు చేస్తోందని విమర్శించారు.

నారా లోకేష్‌ పాదయాత్రతో టిడిపికి ఒరిగెదేమీ లేదని గట్టిగా వాదించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తినడంతో ఇప్పుడు అందరూ ‘సైలెంట్ మోడ్‌’లోకి వెళ్ళిపోయారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి నాలుగు సీట్లు గెలుచుకోగా, వైసీపీ తన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగిసేలోగా రాష్ట్ర రాజకీయాలలో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో?

ADVERTISEMENT
Latest Stories