స్వతంత్ర భారతదేశంలో కేవలం చట్టాలు మాత్రమే సామాన్యుడికి వర్తిస్తాయా.? నాయ్యం అనేది సామాన్యుడికి ఎప్పటికి అందని ద్రాక్షేనా.? ఏళ్ళ తరబడి చేస్తున్న న్యాయపోరాటలు చివరికి బాధిత కుటుంబాలకు అసంతృప్తినే ఎందుకు మిగులుస్తున్నాయి.?
మొన్న నటి ప్రత్యూష కేసులో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు పట్ల బాధిత కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. సుమారు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ కేసులో ప్రత్యుష మరణం వెనుక ఆరోపణలు ఎదుర్కొన్న సిద్దార్ధ్ కి న్యాయస్థానం కేవలం రెండేళ్ల జైలు శిక్ష విధించడం పై ప్రత్యుష తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.
ఇరవై ఏళ్ళ మా న్యాయపోరాటానికి ఫలితం రెండేళ్ల జైలు శిక్షా అనేది ప్రత్యుష తల్లి వాదన. ప్రత్యుష పై అత్యాచారం చేసి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి తమకు జీవితకాల శిక్ష విధించిన వ్యక్తి కి న్యాయస్థానం విధించిన రెండేళ్ల జైలు శిక్ష చాల చిన్నది అనేది ప్రత్యుష బంధువుల ఆరోపణ.
అలాగే అచ్చం ఇదే కేసు మాదిరి దశాబ్దాల న్యాయపోరాటంతో అలసిన మరో కుటుంబం కూడా తమ కూతురు కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. నాటి వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో విజయవాడలో సంచలనం రేపిన ఆయిషా మీరా హత్య కేసు నిన్నటితో ముగిసిందని సీబీఐ కోర్ట్ కేసుని క్లోజ్ చేసింది.
దీనితో ఆయిషా తల్లిదంత్రులు సిబిఐ కోర్ట్ ఎదుట తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ ఇన్నేళ్ల న్యాయపోరాటంతో తమకు కూతురుకి న్యాయం చేయలేకపోయామని, ఇపుడు పూడుస్తున్నది తమ కూతురి అవశేషాలు కాదు న్యాయాన్ని అంటూ ఆయిషా తల్లితండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ పద్దెనిమిదేళ్ళల్లో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎందరో ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు, అయినా ఏ ఒక్క ప్రభుత్వంలోనూ ఆయిషా తల్లితండ్రులకు న్యాయం పట్ల భరోసా దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కేసు కేంద్ర సంస్థ అయిన సిబిఐ కి బదిలీ అయినా కూడా ఫలితం శూన్యమనేది ఆయిషా కుటుంబ సభ్యుల ఆవేదన.
ఇలా ఈ తల్లుల ఆవేదనకు ఆ కూతుర్ల ఆక్రందనలకు చివరికి న్యాయం అందని ద్రాక్షే అన్నట్టుగా బాధిత కుటుంబాలలో తీరని శోకాన్నే మిగిల్చిందని చెప్పాలి. సామాన్యుడి విషయంలో కఠినంగా వ్యవహరించే చట్టాలు, నాయ్యం విషయంలో ఎందుకు నిస్సహాయంగా ఉంటున్నాయి.? ఈ విషయంలో తప్పెవరిది.? ఎవరిని నిందించాలి.?
తమ బిడ్డలను కోల్పోయి కూడా తమ బిడ్డ చావుకు న్యాయం కావాలంటూ ఇలా దశాబ్దాల పాటు కోర్టుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం లేకుంటే అది ఆ బాధిత కుటుంబాలకు జీవిత ఖైదు విధించినట్టు కాదా.? సంచలనం రేపిన ఇటువంటి కేసులలోనే సాక్ష్యాలు లేవంటూ కేసులు క్లోజ్ చేస్తుంటే ఇక సాధారణ కేసులలో బాధితులకు న్యాయం అనేది అత్యాశేనా.?




