రేవంత్ రెడ్డి-జగన్‌కి ఇదే తేడా!

Comparison of Revanth Reddy and Y. S. Jagan Mohan Reddy over Kaleshwaram and Amaravati mega projects

రాష్ట్ర విభజన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి పనులు మొదలుపెడితే జగన్‌ ఏం చేశారు? తెలంగాణలో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే తర్వాత ఏం జరిగింది? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? అందరికీ తెలుసు. రెండూ భారీ ప్రాజెక్టులే రాష్ట్రాలకు, ప్రజలకు ఎంతో మేలు చేసేవే.

కానీ వీటి విషయంలో సిఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సిఎం జగన్‌ వ్యవహరించిన తీరే పూర్తి భిన్నంగా ఉంది. అమరావతిని జగన్‌ ఏం చేశారో మళ్ళీ చెప్పుకోనవసరం లేదు.

ADVERTISEMENT

కేసీఆర్‌ పేరుని పూర్తిగా తుడిచి పెట్టేసేందుకే రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని పాడుబెట్టేస్తున్నారని కేటీఆర్‌, హరీష్‌ రావు ఆరోపిస్తూనే ఉన్నారు.

వారి రాష్ట్రంలో ఈ సమస్యని కూడా చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు సూచన మేరకే సిఎం రేవంత్‌ రెడ్డి ఈ ప్రాజెక్టుని పాడు బెట్టేసి గోదావరి నీటిని ఏపీకి అందించి లబ్ది చేకూర్చుతున్నారని ఆరోపిస్తున్నారు.

బీఆర్ఎస్‌ నేతలు చేస్తున్న ఇటువంటి ఆరోపణలతో సాగునీరు అందని రైతులలో, సామాన్య ప్రజలలో అనుమానాలు, అపోహలు మొదలైతే కాంగ్రెస్‌ పార్టీకి నష్టం వస్తుందని సిఎం రేవంత్‌ రెడ్డికి తెలియదనుకోలేము.

కానీ రాజకీయాల కోసం మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూసి నీళ్ళు నింపే ప్రయత్నం చేయలేదు. నింపితే దాంతో పాటు దిగువన దెబ్బ తిన్న అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. వాటి కింద ఉన్న అనేక గ్రామాలూ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని కేంద్ర నిపుణుల బృందం సలహానే పాటించారు.

వేలకోట్లు ఖర్చుచేసి నిర్మించిన మూడు బ్యారేజీలకు మరమత్తులు చేయించి పునర్వినియోగంలోకి తేవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈలోగా బీఆర్ఎస్‌ చేస్తున్న దుష్ప్రచారంతో పార్టీకి నష్టం జరుగుతున్నప్పటికీ, రాష్ట్రం, ప్రజలు, రైతుల ప్రయోజనాలే ముఖ్యం అనుకున్నారు.

అనుకోకపోయి ఉంటే నాడు హరీష్‌ రావు సవాలు చేసినప్పుడే మూడు బ్యారేజీలలో నీళ్ళు నింపేసేవారు. కూలిపోయేలా చేసేవారు కదా?

కానీ ఈ విషయం చెప్పుకోవడంలో సిఎం రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌ మంత్రులందరూ అలసత్వం ప్రదర్శించడం వల్లనే బీఆర్ఎస్‌ పార్టీకి ఈ అవకాశం లభించిందని చెప్పవచ్చు.

సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసి కేసీఆర్‌ హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినా అది ఉపయోగపడటం లేదు. కానీ దాని కోసం భారీ వడ్డీతో చేసిన అప్పులు మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడకు గుదిబండలా చుట్టుకున్నాయి.

ఈ అప్పులు-భారం గురించి మాత్రం సిఎం రేవంత్‌ రెడ్డితో సహా అందరూ గట్టిగానే చెప్పుకున్నారు. కానీ రైతులకు నీళ్ళు మాత్రమే అర్ధమవుతాయి. గణాంకాలు కావు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేకపోయింది.

కనుక ఈవిషయంలో కూడా బీఆర్ఎస్‌ పార్టీయే రాజకీయంగా పైచేయి సాధించింది. కానీ ఈ విషయంలో కూడా సిఎం రేవంత్‌ రెడ్డి తన నిబద్దతని మరోసారి చాటుకున్నారు.

దీని కోసం కేసీఆర్‌ రూ.82,000 కోట్లు అప్పులు చేసింది. దీనికి 10.90 శాతం వడ్డీ అంటే మామూలుగా ఉండదు. ఇప్పటివరకు చెల్లించిన వడ్డీయే రూ.417 కోట్లు!

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ భారం తగ్గించుకునేందుకు ఈ రెండేళ్ళలోనే రూ.46,963 కోట్లు చెల్లించింది. తక్కువ వడ్డీతో దీర్గకాలిక రుణాలు తీసుకొని కొంత, కేంద్రం సాయంతో మరికొంత కలిపి చెల్లించడంతో అసలు, వడ్డీ భారం గణనీయంగా తగ్గింది.

ఈ ప్రాజెక్ట్ కోసం కేసీఆర్‌ ఎడాపెడా చేసిన అప్పులు తీర్చేస్తూనే ప్రాజెక్టు మరింత దెబ్బ తినకుండా కాపాడుకుంటున్నారు సిఎం రేవంత్‌ రెడ్డి. కానీ లక్షల కోట్ల విలువైన అమరావతి విషయంలో జగన్‌ వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఇద్దరి తీరుని పోల్చి చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా?

ADVERTISEMENT
Latest Stories