కాంగ్రెస్ గెలుపు: క్రెడిట్ రేవంత్ ఖాతాలో.?

Revanth Reddy Leadership Drives Congress Success

తెలంగాణ రాజకీయాలలో గెలుపోటములు పార్టీ పరంగా కంటే కూడా వ్యక్తుల పరంగా సాగుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బిఆర్ఎస్ పతనానికి పార్టీ అధినేత అజ్ఞాతం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేశం, హరీష్ అవినీతి ఆరోపణలు ఒకకారణంగా చెప్పుకుంటుంటే,

ఇక ఈ ఎన్నికలలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా విజయకేతనం ఎగరేసిన కాంగ్రెస్ గెలుపు క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో పడిపోయింది. ఒకవేళ అధికార కాంగ్రెస్ ఎన్నికలలో ఊహించిన స్థాయిలో తన హవా కొనసాగించలేకపోయినా ఆ ఓటమి అవమాన భారం కూడా రేవంత్ ఖాతాలోకే వచ్చి చేరేది.

ADVERTISEMENT

తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రజల నుంచి తనకు రావాల్సిన గౌరవాన్ని, తనకు దక్కాల్సిన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పార్టీకి పదేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. అలాగే ఆ పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కంటే కూడా తన ఉనికి కాపాడుకోవడానికి పోరాడాల్సి వచ్చింది.

కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ కేసీఆర్ ని దమ్ముగా ఢీ కొట్టడానికి, బిఆర్ఎస్ కారు జోరుకి బ్రేకులు వేయడానికి మాత్రం రేవంత్ ఒక్కరే ముందున్నారని చెప్పాలి. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను తనదారికి తెచ్చుకోవడంలో, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకంటూ ఒక వర్గాన్ని పెంచుకోవడంలోనూ రేవంత్ తన రాజకీయ చాణిక్యాన్ని చూపుతున్నారు.

అటు సీనియర్లను కలుపుకుంటూ, ఇటు అధిష్టానం మెప్పు పొందుతూ తన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను చూసుకోవడంతో పాటుగా పార్టీకి అవసరమైన సమయంలోను ఒక కార్యకర్త మాదిరి ఒళ్ళోంచి శ్రమిస్తున్నారు. పార్టీకి కవచంలా మారుతున్నారు. అలాగే తన నాయకత్వంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల మొదలు ఇప్పటికి వరకు తెలంగాణలో జరిగిన ప్రతి ఒక్క ఎన్నికలలోను నాయకుడిగా రేవంత్ తానూ ముందుండి తన పార్టీని నడిపిస్తుండడంతో పాటుగా ప్రత్యర్థి పార్టీని అధికారం అనే అందలం సరిహద్దులను కూడా తాకనివ్వడం లేదు.

ఏదిఏమైనా బిఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్నట్టుగా కాంగ్రెస్ గెలుపుకి రేవంత్ కారణమంటూ ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఇలా ఒక రాష్ట్ర రాజకీయాలు పార్టీలను దాటి వ్యక్తుల సెంట్రిక్ గా జరగడం పార్టీ జెండాలను బలహీనపరుస్తున్నాయా.? వ్యక్తులను బలవంతులను చేస్తున్నాయా.?

ADVERTISEMENT
Latest Stories